ప్రపంచ ఆర్థిక రికవరీకి అడ్డు: రాజన్‌ 

Stop the global economic recovery: Rajan - Sakshi

చైనా, అమెరికా వాణిజ్య యుద్ధంపై వ్యాఖ్య

కోచి/న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం చోటు చేసుకుంటే అది ప్రపంచ ఆర్థిక రంగ రికవరీకి విఘాతం కలిగిస్తుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ‘‘ఈ విషయంలో ఆందోళన కలిగించే ఎన్నో అంశాలున్నాయి. దీన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం’’ అని రాజన్‌ పేర్కొన్నారు. అయితే, ఒక దేశం చర్యకు, మరో దేశం ప్రతిస్పందించే విధానం నుంచి బయటపడతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వాణిజ్య యుద్ధం అనే పదాన్ని వినియోగించడం ఇష్టం లేదు. ఎందుకుంటే వారు ఇంకా ఆ దశలో లేరు. అయితే, ఈ విధమైన చర్యలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక రంగ రికవరీకి హాని కలుగుతుంది. అమెరికా పూర్తి బలంగా ఉండి, ఉద్యోగాలు తగినన్ని ఉన్న తరుణంలో ఈ విధంగా చేయడం సరికాదని భావిస్తున్నా’’ అని రాజన్‌ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో, బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో రాజన్‌ ప్రస్తుతం ఫైనాన్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  

ఏకపక్షంగా చర్యలు తీసుకుంటే స్పందిస్తాం: ప్రభు 
అమెరికా రక్షణాత్మక చర్యలతో ప్రపంచం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎగుమతుల పెంపునకు మార్గాలను అన్వేషించాలని కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. చైనా సహా తన వాణిజ్య భాగస్వాములకు వ్యతిరేకంగా అమెరికా కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ‘‘నిబంధనలకు లోబడి, పారదర్శక, భాగస్వామ్య వాణిజ్య విధానాన్ని భారత్‌ బలంగా విశ్వసిస్తుంది. ఒకవేళ ఏ దేశమైనా ఏకపక్షంగా చర్యలకు దిగితే దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా తగు రీతిలో ఎదుర్కొంటాం’’అని ప్రభు స్పష్టం చేశారు. ఎగుమతుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త మార్కెట్లు, కొత్త ఉత్పత్తులకు అవకాశాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. 

భారత్‌ చొరవ చూపాలి: ఫిక్కి 
ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు ఆవరిస్తుండటంతో వాటిని తగ్గించేందుకు భారత్‌ చురుకైన పాత్ర పోషించాలని ఫిక్కి కోరింది. ప్రపంచ వాణిజ్య ప్రగతిని అవి దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా రక్షణ విధానాలు వాణిజ్య ఘర్షణకు తెరతీసిన నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) విధానాలను కొనసాగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది. ఓ ముఖ్య దేశంగా భారత్‌కు ప్రపంచ దేశాల్లో ఆమోదం పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీవో బలోపేతానికి చర్యలు చేపట్టాలని సూచించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top