పల్లెబాట పట్టిన హ్యుందాయ్ | setting up rural sales outlets of hyundai | Sakshi
Sakshi News home page

పల్లెబాట పట్టిన హ్యుందాయ్

Aug 13 2014 12:05 AM | Updated on Sep 2 2017 11:47 AM

వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా పల్లెబాట పట్టింది. గ్రామీణ ప్రాంతాల నుంచీ కంపెనీ కార్లకు గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా పల్లెబాట పట్టింది. గ్రామీణ ప్రాంతాల నుంచీ కంపెనీ కార్లకు గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కస్టమర్లకు చేరువ అయ్యేందుకు మూడు, నాల్గవ తరగతి పట్టణాల్లో రూరల్ సేల్స్ ఔట్‌లెట్లను (ఆర్‌ఎస్‌వో) విస్తరిస్తోంది. ప్రస్తుతం  దేశవ్యాప్తంగా సుమారు 315 ఆర్‌ఎస్‌వోలను కంపెనీ నిర్వహిస్తోంది. ఈ విధానం విజయవంతం కావడంతో వ్యాపార అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఔట్‌లెట్లను ప్రారంభించనుంది. మొత్తం అమ్మకాల్లో 10 శాతం వాటా ఆర్‌ఎస్‌వోల ద్వారా సమకూరుతోంది. 2014-15లో ఇది 15 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.

 ఏటా రెండు మోడళ్లు..
 హ్యుందాయ్ భారత్‌లో ఏటా కనీసం రెండు మోడళ్లను పరిచయం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. 2014లో మూడు మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చామని కంపెనీ ప్రొడక్షన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ టి.సారంగరాజన్ తెలిపారు. ఎలైట్ ఐ20 మోడల్‌ను మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్‌ఎస్‌ఎం తేజ అడుసుమల్లి చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి త్వరలో రానున్నామని వెల్లడించారు. ప్రతి మోడల్ ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న మోడళ్లకు మార్పులు చేసి భారత్‌లో విడుదల చేస్తున్నామని చెప్పారు. 7 సీట్ల మల్లీ యుటిలిటీ వాహనాన్ని కంపెనీ 2016లోగా భారత్‌కు తెచ్చే యోచనలో ఉంది.

 హైదరాబాద్ ఆర్‌అండ్‌డీలో..
 నూతన మోడళ్ల డిజైనింగ్‌లో హైదరాబాద్‌లోని హ్యుందాయ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం పాత్ర అత్యంత కీలకమని సారంగరాజన్ పేర్కొన్నారు. విదేశీ మోడళ్ల రూపకల్పనలో సైతం ఈ కేంద్రం పాలుపంచుకుంటోందని చెప్పారు. ఇక ఈ ఏడాది దేశంలో 4.10 లక్షల వాహనాల విక్రయ లక్ష్యం విధించుకున్నామని పేర్కొన్నారు. 2013-14లో 3.95 లక్షల యూనిట్లు హ్యుందాయ్ విక్రయించింది. ఎగుమతులు 2.3 లక్షల యూనిట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షల యూనిట్లు చేయాలని నిర్ణయించింది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చెన్నై ప్లాంటు నుంచి యూరప్ దేశాలకు ఎగుమతులను నిలిపివేసింది. ఇక నుంచి దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement