సెన్సెక్స్‌ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270 | Sensex hits new record high at 39,270 | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ తక్షణ నిరోధశ్రేణి 39,120–39,270

Apr 8 2019 6:03 AM | Updated on Apr 8 2019 6:03 AM

Sensex hits new record high at 39,270 - Sakshi

వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్‌ కొత్త రికార్డును నెలకొల్పగా, గతవారం నిఫ్టీ కూడా అదే ఫీట్‌ను సాధించింది. కేవలం నెలరోజుల్లో భారత్‌ సూచీలు 10 శాతం ర్యాలీ జరపడం విశేషం. ఈ ట్రెండ్‌ భారత్‌కే పరిమితం కాలేదు. దాదాపు ఇదేస్థాయిలో అమెరికా, జర్మనీ సూచీలు సైతం పెరిగాయి. ఆసియాలో హాంకాంగ్, చైనా ఇండెక్స్‌లు కూడా 5 శాతంపైగానే జంప్‌చేశాయి. అమెరికా కేంద్రబ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌...వడ్డీ రేట్లపెంపునకు, బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమానికి స్వస్తిచెప్పడం... ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి కారణం కావొచ్చు.  కానీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ త్వరలో ప్రారంభం కానుండడం, కార్పొరేట్‌ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండడం వంటి అంశాల నేపథ్యంలో భారత మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లగలుగుతుందా లేదా అన్న సంశయం ప్రస్తుతం విశ్లేషకుల్లో నెలకొని ఉంది. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే...  

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఏప్రిల్‌ 5తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,270 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నమోదుచేసిన అనంతరం చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 190 పాయింట్లు పెరిగి 38,862 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరిగితే తొలుత 39,120–39,270 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 39,850 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే 38,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 38,580 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు.  

నిఫ్టీ అవరోధశ్రేణి 11,730–11,760
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,761 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయి వద్ద జరిగిన భారీ లాభాల స్వీకరణ కారణంగా 11,559 పాయింట్ల స్థాయికి తగ్గింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 43 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ అప్‌ట్రెండ్‌ కొనసాగితే తొలుత 11,730–760 పాయింట్ల శ్రేణి నిరోధించవచ్చు. డబుల్‌టాప్‌గా పరిణమించిన ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. ఆ సందర్బంలో వేగంగా 11,810 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే క్రమేపీ 11,890 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి అవరోధశ్రేణిని దాటలేకపోతే 11,610 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,560 పాయింట్ల  వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement