సెబీ సంస్కరణల మోత...

సెబీ సంస్కరణల మోత...


బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం..


  • పీఎస్‌యూల్లో 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరి; మూడేళ్ల గడువు

  • ఐపీఓ, ఓఎఫ్‌సీ నిబంధనల్లోనూ మార్పులు...

  • ఎసాప్స్ స్కీమ్‌లకు కొత్త నిబంధనలు...


న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇటు ఇన్వెస్టర్లు, అటు ప్రమోటర్లకు సంబంధించి కీలక సంస్కరణలకు తెరలేచింది. నియంత్రణ సంస్థ సెబీ... గురువారం జరిగిన బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ప్రధానంగా మూడేళ్లలోగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అన్ని ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో కనీసం 25 శాతం పబ్లిక్ వాటా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 25 శాతం కంటే తక్కువ పబ్లిక్ వాటా ఉన్న 36 పీఎస్‌యూల్లో రానున్న మూడేళ్లలో ప్రభుత్వం కచ్చితంగా వాటాను విక్రయించాల్సి ఉంటుంది.

 

వెరసి సుమారు రూ.60 వేల కోట్ల మేర ఖజానాకు జమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం పీఎస్‌యూల్లో కనీసం 10% పబ్లిక్ వాటా తప్పనిసరి కాగా,  లిస్టెడ్ నాన్-పీఎస్‌యూలకైతే ఈ పరిమితి 25%. బోర్డు సమావేశంలో స్టాక్ మార్కెట్లకు సంబంధించి కొన్ని అత్యంత ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నామని సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. ప్రమోటర్లు ఎవరనేదానితో సంబంధం లేకుండా అన్ని లిస్టెడ్ కంపెనీలకూ ఒకేవిధమైన నిబంధనలను అమలు చేయడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమన్నారు.

 

 ఐపీఓ నిబంధనలు సరళతరం...

 ప్రైమరీ మార్కెట్‌ను మళ్లీ పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ప్రారంభ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)  నిబంధనలను సెబీ సరళతరం చేసింది. దీనిప్రకారం ఇకనుంచి రూ.4,000 కోట్లకు మించి ఇష్యూ అనంతర మూలధనం(పోస్ట్-ఇష్యూ క్యాపిటల్) ఉండే కంపెనీలు కనీసం 10 శాతం వాటాను ఐపీఓల్లో విక్రయించాల్సి ఉంటుంది. ఇతర కంపెనీల ఐపీఓల్లో మాత్రం 25 శాతం వాటా లేదా రూ.400 కోట్లు వీటిలో దేనివిలువ తక్కువగా ఉంటే ఆమేరకు వాటాను విక్రయించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. అయితే, 25 శాతం కంటే తక్కువ వాటా విక్రయించిన కంపెనీలన్నీ మూడేళ్లలోగా ఈ పరిమితిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

మరోపక్క, పబ్లిక్ ఇష్యూల్లో సంస్థాగత ఇన్వెస్టర్లకు సంబంధించి షేర్ల కేటాయింపుల్లో ఇప్పటిదాకా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్న 30 శాతం వాటాను... ఇకపై 60 శాతానికి పెంచుతూ కూడా సెబీ నిర్ణయం తీసుకుంది. ఫ్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపు తుది ధరను ఇప్పటివరకూ అమల్లో ఉన్న ట్రేడింగ్ పరిమాణం సగటు రేటు ఆధారంగా కాకుండా... ఇష్యూ ముందురోజు ముగింపు రేటు ప్రకారం ఇచ్చేలా నిబంధనలను సెబీ మార్చింది. పబ్లిక్ ఇష్యూ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏడాది వ్యవధిలోపు కేటాయించిన బోనస్ షేర్లను సైతం ఇష్యూలో విక్రయించేందుకు లైన్‌క్లియర్ చేసింది.

 

ఆఫర్ ఫర్ సేల్ మరింత విస్తృతం...

లిస్టెడ్ కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించే షేర్ల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కచ్చితంగా 10% వాటాను కేటాయించాలన్న నిబంధనను సెబీ ఆమోదించింది. అంతేకాకుండా రిటైలర్లకు షేర్ల విక్రయం ధరలో డిస్కౌంట్ కూడా ఇచ్చేందుకు అనుమతించింది. లిస్టెడ్ కంపెనీలో 10% కంటే అధికంగా వాటా ఉన్న నాన్-ప్రమోటర్ వాటాదారులు ఓఎఫ్‌ఎస్ రూట్‌లో తమ షేర్లను విక్రయించుకునేందుకు సెబీ అవకాశం కల్పించింది. 2012 ఫిబ్రవరిలో సెబీ ప్రవేశపెట్టిన ఈ విధానం విజయవంతమైంది. అప్పటినుంచి.. 100కు పైగా కంపెనీలు ఈ రూట్‌లో రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇప్పటిదాకా మార్కెట్ విలువపరంగా టాప్-100 కంపెనీలకు మాత్రమే అవకాశం ఉన్న ఓఎఫ్‌ఎస్ రూట్‌ను టాప్-200 కంపెనీలన్నింటికీ వర్తించేలా సెబీ అనుమతించింది.

 

 ఇతర నిర్ణయాలు ఇవీ...

 

 కేవైసీ: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు సంబంధించిన వివరాల (కేవైసీ)ను ఇతర ఫైనాన్షియల్ రంగ నియంత్రణ సంస్థలతోనూ పంచుకునేందుకు అనుమతి. ఇప్పటివరకూ సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల మధ్యే కేవైసీ వివరాల షేరింగ్ ఉంది. ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లందరికీ ఒకేవిధమైన కేవైసీ ప్రక్రియ అమలులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.

 

 రీసెర్చ్ ఎనలిస్ట్‌లపైనా నియంత్రణ: రీసెర్చ్ ఎనలిస్ట్‌ల కార్యకలాపాల్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకుగాను వాళ్లను నియంత్రణ పరిధిలోని తీసుకొస్తూ నిబంధనలను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయా సంస్థలు తప్పుడు నివేదికలతో ఇన్వెస్టర్లను మోసగించకుండా వాళ్లకు మరింత రక్షణ కల్పించడమే వీటి ప్రధానోద్దేశం. ఇప్పటివరకూ రీసెర్చ్ ఎనలిస్ట్‌లపై నియంత్రణేదీ లేదు. కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత, సంస్థాగత రీసెర్చ్ ఎనలిస్ట్‌లంతా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. వాళ్లిచ్చే నివేదికలు ఇతరత్రా అంశాలకు సంబంధించిన కొన్ని వివరాలను సెబీకి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్/వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ మాత్రం ఈ నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

 

ఎసాప్స్ స్కీమ్స్: ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్) స్కీమ్‌లకు సంబంధించిన నిబంధనలను సెబీ మరింత సరళతరం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఎసాప్ ట్రస్ట్‌లను షేర్‌హోల్డింగ్ సంస్థల్లో ప్రత్యేక విభాగంగా ఇకపై పరిగణిస్తారు. అంటే ఈ ట్రస్ట్‌లోని షేర్లను పబ్లిక్‌కి సంబంధించిన కేటగిరీలో లేదా ప్రమోటర్ గ్రూప్ కేటగిరీ కిందకానీ ఇకపై పరిగణించరు. ఈ నిబంధనల పూర్తికి అయిదేళ్ల గడువు ఇస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎసాప్స్ కింద ఉద్యోగులకు షేర్ల కేటాయింపు జరిపే  కంపెనీలు కొన్ని నిబంధనలకు లోబడి తమ సొంత కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు సెబీ వీలుకల్పించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top