
న్యూఢిల్లీ: పలు ప్రభుత్వరంగ బ్యాంకులకు తాజా అదనపు మూలధన సాయం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సెబీ మినహాయింపు ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, విజయాబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నిధుల సాయంతో వీటిల్లో కేంద్రం వాటా పెరగనుంది. నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత మేర వాటా పెంచుకుంటే ప్రస్తుత వాటాదారులకు కేంద్రం ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, తాజా నిధుల సాయం తర్వాత కూడా ఆయా బ్యాంకుల నియంత్రణలో ఎటువంటి మార్పు ఉండనందున ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వం అందిస్తున్న సాయం ఆయా బ్యాంకులు నియంత్రణ పరమైన నిబంధనలు (మూలధన అవసరాలు) చేరుకునేందుకు వీలు కల్పిస్తుందని, తర్వాత ఈక్విటీ క్యాపిటల్‌ను మరింత పెంచుకునేందుకు అవసరమైన అదనపు పరపతి లభిస్తుందని సెబీ పేర్కొంది.
తాజా మూలధన సాయంతో పీఎన్‌బీలో ప్రభుత్వం వాటా 5.21 శాతం, కెనరా బ్యాంకులో 6.25 శాతం, సిండికేట్ బ్యాంకులో 9.73% మేర పెరగనుంది. అలాగే, విజయా బ్యాంకులో 5.48%, బ్యాంకు ఆఫ్ బరోడాలో 5.33%, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 11.91% మేర కేంద్రం వాటా పెరుగుతుంది.