అంతా ఆఖరి గంటలోనే..!

Sales turnover in the last hour - Sakshi

ఐసీఐసీఐ, యాక్సిస్‌లకూ పీఎన్‌బీ సెగ

 పీసీఏ పరిధిలోకి మరో ఐదు బ్యాంక్‌లు!

చివరి గంటలో అమ్మకాల వెల్లువ

లాభాలతో మొదలై నష్టాలతో ముగింపు

ప్లస్‌ 313 నుంచి మైనస్‌ 537కు సెన్సెక్స్‌

430 పాయింట్లు డౌన్‌; 33,317 వద్ద ముగింపు

 ఈ ఏడాది కనిష్ట స్థాయికి సెన్సెక్స్‌ 

కీలకమైన 10,250 దిగువకు నిఫ్టీ

110 పాయింట్ల నష్టం.. 10,249 వద్ద క్లోజ్‌

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రుణ కుంభకోణం తాజా ప్రకంపనల ధాటికి మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ కుదేలయింది. మరో ఐదు బ్యాంక్‌లను పీసీఏ పరిధిలోకి ఆర్‌బీఐ తేనున్నదన్న వార్తలతో బ్యాంకింగ్‌ రంగ స్థితిగతులు ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టాయి. ట్రంప్‌ సుంకాల విధింపుకు వ్యతిరేకత ప్రబలంగా ఉండటంతో వాణిజ్య యుద్ధాలపై ఆందోళన తగ్గి ప్రపంచ మార్కెట్లు లాభపడినా... మన మార్కెట్‌ మాత్రం భారీగా నష్ట పోయింది. పీఎన్‌బీ  కుంభకోణం 2010 నుంచే జరుగుతోందని వెల్లడి కావడం, ఈ స్కామ్‌ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓలకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందడం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కీలకమైన 33,350 పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,250 పాయింట్ల దిగువకు పడిపోయాయి. వరుసగా ఐదో రోజూ ప్రధాన స్టాక్‌ సూచీలు నష్టపోయాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 430 పాయింట్లు నష్టపోయి 33,317 పాయింట్ల వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 10,249 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి.  గత ఏడాది డిసెంబర్‌ 14 తర్వాత సెన్సెక్స్‌కు ఇదే కనిష్ట స్థాయి. గత నెల 6 తర్వాత సెన్సెక్స్‌ అత్యధిక పాయింట్లు నష్టపోవడం కూడా ఇదే తొలిసారి. కాగా సెన్సెక్స్‌కు ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి. 

ఆరంభ లాభాలు ఆవిరి...
ఉక్కు, అల్యూమినియమ్‌ దిగుమతి సుంకాలపై నిరసన తీవ్రం కావడంతో సుంకాల విషయమై అమెరికా పునరాలోచన చేసే అవకాశాలున్నాయన్న అంచనాల కారణంగా వాణిజ్య యుద్ధాల ఆందోళన తగ్గింది. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ దన్నుతో సెన్సెక్స్‌ ఉదయం  34,047 పాయింట్ల వద్ద భారీ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఇంట్రాడేలో 313 పాయింట్ల లాభంతో 34,060 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లకు ఎస్‌ఎఫ్‌ఐఓ నోటీసుల వ్యవహారంతో లాభాలు ఆవిరయ్యాయి. చివరి గంటలో లాభాల స్వీకరణ కూడా చోటు చేసుకోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 537 పాయింట్ల నష్టంతో 33,210 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 850 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 83 పాయింట్ల లాభంతో 10,441 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత 143 పాయింట్లు నష్టపోయి 10,216 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ రోజంతా 226 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,129 పాయింట్లు కుదేలైంది. భారత రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు క్షీణిస్తున్నాయని ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ తాజా నివేదిక వెల్లడించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు వరుసగా ఐదో రోజూ పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. 

ప్రపంచ మార్కెట్లు బాగానే ఉన్నా...
అంతర్జాతీయంగా ఆశావహ పరిస్థితులున్నప్పటికీ, మన మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. మొండి బకాయిల సమస్య, బాండ్ల రాబడులు పెరుగుతుండడం, నిధులపై అధిక వడ్డీ వ్యయాలు ప్రభావం చూపాయని వివరించారు. సమీప భవిష్యత్తులో మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ అంచనా వేస్తున్నారు. 

ఇవీ... మార్కెట్‌ విశేషాలు
సెన్సెక్స్‌లో నాలుగు షేర్లు– ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, టాటా స్టీల్, హీరో మోటొకార్ప్, కోల్‌ ఇండియాలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన షేర్లు నష్టపోయాయి. సన్‌ ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, విప్రో, పవర్‌ గ్రిడ్, ఐటీసీ, రిలయన్స్, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌ టీ, ఇన్ఫోసిస్, హిందుస్తాన్‌ యూనిలివర్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, ఏషియన్‌ పెయింట్స్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీసీపీలు 3 శాతం వరకూ నష్టపోయాయి. 

కోలుకున్న ప్రపంచ మార్కెట్లు
వాణిజ్య యుద్ధాల భయాలు తగ్గడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. జపాన్‌ నికాయ్, చైనా షాంగై కాంపొజిట్, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు 1–2% రేంజ్‌లో పెరిగాయి.  

ఐదు రోజుల్లో రూ.4.30 లక్షల కోట్లు ఆవిరి
ఐదు రోజుల స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా రూ.4.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,129 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.4,30,043 కోట్లు ఆవిరై రూ.1,44,20,606 కోట్లకు పడిపోయింది. ఒక్క మంగళవారం రోజే రూ. 1.54 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. 

బ్యాంక్‌ షేర్లు బేర్‌...
పీఎన్‌బీ రుణ కుంభకోణం దర్యాప్తులో భాగంగా సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఐఓ) ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ చందా కొచర్‌కు,  యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ శిఖా శర్మలకు నోటీసులు జారీ చేసింది. పీఎన్‌బీ రుణ కుంభకోణంలో కీలకమైన నీరవ్‌ మోదీ, మేహుల్‌ చోక్సీలకు ఇతర బ్యాంక్‌ల్లో కూడా రుణాలున్నాయో లేదోనన్న విచారణలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐఓ ఈ నోటీసులు జారీ చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మోదీ, చోక్సీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన 31 బ్యాంక్‌లకు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఎస్‌ఎఫ్‌ఐఓ విచారించనున్నదని వార్తలు వచ్చాయి. కాగా పీఎన్‌బీ స్కామ్‌లో కీలకమైన వ్యక్తుల్లో ఒకరైన గీతాంజలి జెమ్స్‌ మేహుల్‌ చోక్సీకి ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.1,000 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.700 కోట్ల మేర రుణాలిచ్చాయని సమాచారం. ఇంట్రాడేలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ (పీసీఏ) ప్లాన్‌ కిందకు ఈ బ్యాంక్‌లను ఆర్‌బీఐ తెచ్చే అవకాశాలున్నాయన్న వార్తలు ఈ బ్యాంక్‌ షేర్లను పడగొట్టాయి.  మరో వైపు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా తాజా ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ అన్ని ప్రతికూల వార్తల కారణంగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్, యస్‌బ్యాంక్‌ షేర్లు 3 శాతం వరకూ పతనమయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top