80 స్థాయికి రూపాయి విలువ!

Rupee may breach 80 level with dollar - Sakshi

2020లో ఇప్పటివరకూ 6% డౌన్‌

కోవిడ్‌-19 తో ఆర్థిక పురోగతికి దెబ్బ

కరెంట్‌ ఖాతా, డాలర్‌ మారకం ఎఫెక్ట్‌

వెంకట్‌ త్యాగరాజన్‌ అంచనా

ఆర్‌ఐఎల్‌ మాజీ ఫారెక్స్‌ హెడ్‌ 

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బలహీనతలు కొనసాగే వీలున్నట్లు ఫారెక్స్‌ నిపుణులు వెంకట్‌ త్యాగరాజన్‌ తాజాగా పేర్కొన్నారు. ఇటీవలే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌)లో ఫారెక్స్‌ హెడ్‌ బాధ్యతల నుంచి రిటైర్‌ అయిన వెంకట్‌ ఇందుకు పలు అంశాలు కారణంకానున్నట్లు చెబుతున్నారు. కోవిడ్‌-19 ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడనున్న నేపథ్యంలో రూపాయి నీరసించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్‌లో డాలరుతో మారకంలో రూపాయి విలువ 80 స్థాయికి వెనకడుగు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌-19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు దశాబ్దాల తదుపరి ఈ ఏడాది క్షీణతను చవిచూడనున్నట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. 

ఇతర అంశాలు
రూపాయి మారకపు విలువపై జీడీపీ మందగమనానికితోడు ఇతర కారణాలు సైతం ప్రభావం చూపవచ్చని వెంకట్‌ వివరించారు. 26ఏళ్లుగా కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్‌ నిర్వహించిన వెంకట్‌ ఆర్‌ఐఎల్‌ ఫారెక్స్‌ హెడ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ట్రెజరీను ఆర్‌ఐఎల్‌ నిర్వహించే విషయం విదితమే. రూపాయి మారకపు విలువపై ఆర్థిక వృద్ధి, కరెంట్‌ ఖాతా, బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి. అంతేకాకుండా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కదలికలు సైతం రూపాయిని ప్రభావితం చేస్తాయని ఫారెక్స్‌ వర్గాలు తెలియజేశాయి. 

ఈ ఏడాది డీలా
ఈ ఏడాది ఆసియా కరెన్సీలలోకెల్లా రూపాయి అత్యంత బలహీనపడినప్పటికీ ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తుండటంతో కొంతమేర బలాన్ని సంతరించుకుంది. దీనికితోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగం రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ దిగ్గజాలు భారీ పెట్టుబడులకు దిగడం అనుకూలిస్తున్నట్లు ఫారెక్స్‌ నిపుణులు పేర్కొన్నారు. గ్లోబల్‌ ఫండ్స్‌ 4.5 బిలియన్‌ డాలర్లను ఈ క్వార్టర్‌లో స్టాక్స్‌ కొనుగోలుకి వినియోగించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇటీవల ఆర్‌ఐఎల్‌ చేపట్టిన రైట్స్‌ ఇష్యూ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలు తదితరాలకు ఈ పెట్టుబడులు ప్రవహించినట్లు పేర్కొన్నారు. మరోపక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) మార్గంలో 15 బిలియన్‌ డాలర్లకుపైగా నిధులు రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ప్రవహించినట్లు వివరించారు.

6 శాతం డౌన్‌
డాలరుతో మారకంలో రూపాయి విలువ 2020లో ఇప్పటివరకూ సుమారు 6 శాతం క్షీణించింది. ఇతర ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయే అత్యధికంగా నీరసించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఫైనాన్షియల్‌ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక వృద్ధి బలహీనపడుతున్న తరుణంలో కఠిన పరపతి విధానాలకు వీలుండదని వెంకట్‌ పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో కరెన్సీ విలువ వెనకడుగు వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరవచ్చని తెలియజేశారు. ఇటీవల ఫిచ్‌, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ తదితర దిగ్గజాలు దేశ సావరిన్‌ రేటింగ్‌ ఔట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. వ్యవస్థలో రుణాల స్థాయి అధికంగా ఉండటంతోపాటు.. ప్రయివేట్‌ రంగంలో రుణ చెల్లింపులు భారంగా మారుతున్నాయని.. దీంతో బ్యాంకింగ్‌ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు వెంకట్‌ వివరించారు. డాలరుతో మారకంలో రూపాయి ఏప్రిల్‌లో 76.90 వద్ద చరిత్రాత్మక కనిష్టాన్ని తాకగా.. కొద్ది రోజులుగా 75 స్థాయిలో ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top