రేట్లకు రెక్కలు!!

Rupee Closes Below 70-Mark For First Time Against US Dollar - Sakshi

రూపాయి పతనంతో ప్రకంపనలు..

వినియోగ వస్తువుల నుంచి ఫోన్ల దాకా అన్నీ ప్రియం

పెట్రోల్, వంటగ్యాస్‌కూ మంట

చమురు దిగుమతులూ భారం

న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో వినియోగవస్తువుల నుంచి ఫోన్లు మొదలైన ఉత్పత్తుల దాకా అన్నింటి ధరలు పెరగనున్నాయి. దేశీ కరెన్సీ పతనం ఇదే తీరుగా కొనసాగితే ..ముడి చమురు దిగుమతుల బిల్లు పెరిగిపోయి, పెట్రోల్, డీజిల్‌ మొదలుకుని వంట గ్యాస్‌ దాకా అన్నింటి రేట్లు ఎగియనున్నాయి. దిగుమతుల భారం పెరిగిపోతుండటంతో.. కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ కంపెనీలు పండుగ సీజన్‌ ప్రారంభం కావడానికి ముందుగానే రేట్లను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూపాయి మారకం పతన ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు సోనీ, పానాసోనిక్, గోద్రెజ్‌ వంటి సంస్థలు తెలిపాయి. ‘డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70 స్థాయిని దాటేయడం ముడివస్తువుల వ్యయాలపై మరింతగా ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రభావాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే.. సమీప భవిష్యత్‌లో రేట్లు పెంచక తప్పక పోవచ్చు’ అని గోద్రెజ్‌ అప్లయన్సెస్‌ బిజినెస్‌ హెడ్, ఈవీపీ కమల్‌ నంది వెల్లడించారు. ఒకవేళ 70 స్థాయి దాటి రూపాయి కొనసాగితే.. పండుగలకు ముందే రేట్లను పెంచవచ్చని, ఆగస్టు ఆఖర్లోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.

అటు పానాసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మనీష్‌ శర్మ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే వినియోగ ఉత్పత్తుల రేట్లపై ఒత్తిడి తప్పదన్నారు. ప్రస్తుతానికి దేశీ కరెన్సీ తీరును పరిశీలిస్తున్నామని, టీవీల రేట్ల పెంపుపై ఇంకా నిర్ణయాలేమీ తీసుకోలేదని సోనీ ఇండియా హెడ్‌ ఆఫ్‌ సేల్స్‌ సతీష్‌ పద్మనాభన్‌ చెప్పారు. కొన్ని ఉత్పత్తుల రేట్లను పెంచే అవకాశాలు ఉండొచ్చని, ఇందుకు మరికాస్త సమయం పట్టొచ్చని హాయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగాంజా తెలిపారు.  

ఎంట్రీ లెవెల్‌ ఫోన్లపై ప్రభావం..
రూపాయి పతనం కొనసాగితే ముడివస్తువుల ధరలూ పెరుగుతాయని, ఫలితంగా మొబైల్‌ ఫోన్లు.. ముఖ్యంగా ఎంట్రీలెవెల్‌ వేరియంట్స్‌ రేట్లు పెరగవచ్చని హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలు వెల్లడించాయి. ‘డాలర్‌ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో మొబైల్స్‌ తయారీ వ్యయాలూ పెరుగుతాయి. ఫలితంగా హ్యాండ్‌సెట్స్‌ రేట్లూ పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ (ఇండియా) డైరెక్టర్‌ నిధి మార్కండేయ చెప్పారు.

కస్టమ్స్‌ సుంకాలు, ముడివస్తువుల రేట్ల పెరుగుదలతో హ్యాండ్‌సెట్స్‌ పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని.. కోమియో ఇండియా సీఈవో సంజయ్‌ కలిరోనా తెలిపారు. రూపాయి పతనం ప్రభావాలను సమీక్షిస్తున్నామని, రేట్లపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంట్రీ లెవెల్‌ మొబైల్స్‌పై నేరుగా ప్రభావం పడొచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ తెలిపారు. అయితే ఈ విభాగంలో తీవ్ర పోటీ నెలకొనడంతో రేట్ల పెంపుపై నిర్ణయం చాలా కష్టమైన వ్యవహారమని ఆయన పేర్కొన్నారు.
 
పెరిగే చమురు బిల్లు ..
రూపాయి కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతుండటం చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల ముడిచమురు దిగుమతుల భారం ఈ ఆర్థిక సంవత్సరం ఏకంగా 26 బిలియన్‌ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముడిచమురు దిగుమతుల భారం పెరిగితే.. తత్ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్‌ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం దిగుమతులే ఉంటున్నాయి. 2017–18లో 220.43 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ కోసం 87.7 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

ఈ ఆర్థిక సంవత్సరం దిగుమతులు 227 మిలియన్‌ టన్నుల మేర ఉంటాయని అంచనా. ‘ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో డాలర్‌తో రూపాయి మారకం రేటు 65 స్థాయిలో, ముడిచమురు బ్యారెల్‌ రేటు 65 డాలర్లుగా ఉంటుందనే అంచనాలతో.. దిగుమతుల బిల్లు 108 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాం. కానీ ఇది మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి పతనం వల్ల పూర్తి ప్రభావాలు ఈ నెలాఖరులోనే కనిపించే అవకాశాలు ఉన్నాయి.

రూపాయి పతనంతో ఎగుమతి సంస్థలతో పాటు దేశీయంగా చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్‌జీసీ మొదలైన వాటికీ ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఇవి డాలర్ల మారకంలో బిల్లింగ్‌ చేయడం వల్ల వాటి నుంచి ఇంధనాలు కొనుగోలు చేసి విక్రయించే రిటైల్‌ సంస్థలు రేట్లను పెంచాల్సి వస్తుంది.  ఒకవేళ చమురు రేట్లు ప్రస్తుత స్థాయిలోనే ఉండి, రూపాయి 70 స్థాయిలోనే కొనసాగిన పక్షంలో ఇంధన ధరలు లీటరుకు 50–60 పైసల మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.

రూపాయి మరింత పతనం
తొలిసారిగా 70కి దిగువన క్లోజింగ్‌
26 పైసలు డౌన్‌

ముంబై: రూపాయి విలువ శరవేగంగా కరిగిపోతోంది. రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే గురువారం రూపాయి మారకం విలువ మరింత క్షీణించి కీలకమైన 70 మార్కు దిగువన తొలిసారిగా క్లోజయ్యింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే మరో 26 పైసలు తగ్గి 70.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 70.40ని కూడా తాకడం గమనార్హం. రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యంతో రూపాయి పతనానికి కొంతైనా అడ్డుకట్ట పడిందని కరెన్సీ ట్రేడర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 69.89తో పోలిస్తే గురువారం ఫారెక్స్‌ మార్కెట్లో గ్యాప్‌ డౌన్‌తో ఏకంగా 70.19 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 70.40 స్థాయికి కూడా పడిపోయి చివరికి కొంత కోలుకుని 70.15 వద్ద క్లోజయ్యింది.  

పెరిగిపోతున్న ద్రవ్య లోటు, క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, అమెరికా–చైనా మధ్య వాణిజ్య భయాలపై ఆందోళనలు, డాలర్‌కు డిమాండ్‌ తదితర అంశాల నేపథ్యంలో దేశీ కరెన్సీ విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 10.5 శాతం మేర క్షీణించింది. వర్ధమాన దేశాల కరెన్సీల పతనానికి కారకమైన టర్కీ లీరా విలువ మాత్రం పెరిగింది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 15 బిలియన్‌ డాలర్లు అందిస్తామంటూ కతార్‌ ముందుకు రావడంతో లీరా ర్యాలీ కొనసాగింది. మరోవైపు, రూపాయి క్షీణతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా 17 శాతం మేర పెరిగిన రూపాయి మారకం ప్రస్తుతం మళ్లీ సహజ స్థాయికి వస్తోందని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top