ఆర్థిక వ్యవస్థకు ధరల సెగ!

Retail Inflation Accelerates To 4.58% - Sakshi

ఏప్రిల్‌లో పెరిగిన టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణం

జూన్‌లో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంపై ప్రభావం  

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ధరల తీవ్రత ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) జూన్‌ 4–5 తేదీల్లో 2018–19 రెండవ ద్వైవార్షిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. దీంతో కీలక రేట్లు పెరిగే అవకాశాలూ ఉన్నాయని కొందరి విశ్లేషణ.  

టోకు ద్రవ్యోల్బణం 3.18 శాతం
టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.18 శాతంగా నమోదయ్యింది. ఇంధన ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం.   
 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 2.47%గా ఉంటే, గత ఏడాది ఏప్రిల్‌లో 3.85 శాతంగా ఉంది.
 ఫుడ్‌ ఆర్టికల్స్‌ ధరల పెరుగుదల రేటు ఈ ఏడాది మార్చిలో పెరక్కపోగా –0.28 శాతం క్షీణతలో ఉంది. ఏప్రిల్‌లో 0.87 శాతంగా నమోదయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఈ రేటు 0.58 శాతం.  
 తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు వార్షికంగా యథాతథంగా 3.11 శాతంగా ఉంది.  

రిటైల్‌ ద్రవ్యోల్బణం ట్రెండ్‌ రివర్స్‌...
 మూడు నెలలుగా తగ్గుతూ వస్తున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో పెరిగింది. 4.58%గా ఉంది. మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.28%కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో 2.99 శాతంగా నమోదయ్యింది.  
   ప్రొటీన్‌ రిచ్‌ ఐటమ్స్‌– మాంసం, చేపల ధరలు ఏప్రిల్‌లో 3.59 శాతం, 3.17 శాతం చొప్పున పెరిగాయి. గుడ్ల ధరలు 6.26 శాతం ఎగశాయి.  
 పండ్ల బాస్కెట్‌ ధరల పెరుగుదల రేటు మార్చిలో 5.78% ఉంటే, ఏప్రిల్‌లో 9.65%కి ఎగసింది.  
   కూరగాయల ధరలు మాత్రం 11.7 శాతం నుంచి 7.29 శాతానికి తగ్గాయి. మొత్తం ఫుడ్‌ బాస్కెట్‌ ధర దాదాపు నిశ్చలంగా 2.8 శాతంగా ఉంది.  
    రిటైల్‌ ధరల విషయంలో మొత్తం ఐదు విభాగాలను పరిశీలించి చూస్తే– ఆహారం, పానీయాల ధరలు పెరుగుదల రేటు 3 శాతం. పాన్, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ధరల పెరుగుదల రేటు 7.91 శాతం. దుస్తులు, పాదరక్షల ధరల పెరుగుదల రేటు 5.11 శాతం. హౌసింగ్‌లో ద్రవ్యోల్బణం 8.50 శాతం. ఇక చివరిగా ఫ్యూయల్, లైట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం 5.24 శాతంగా నమోదయ్యింది. ఒక్క పెట్రోల్‌ను చూస్తే, మార్చిలో పెరుగుదల రేటు 2.55 శాతం ఉంటే, ఏప్రిల్‌లో ఏకంగా 9.45 శాతానికి ఎగసింది. ఇదే కాలంలో డీజిల్‌ ధర పెరుగుదల రేటు 6.12 శాతం నుంచి 13.01 శాతానికి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top