
ఆగస్ట్‌లో 2.07 శాతంగా నమోదు
మైనస్‌లోనే ఆహార ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో నమోదైన ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి నుంచి ఆగస్ట్ నెలలో కాస్తంత ఎగిసింది. జూలైలో 1.61% కాగా, ఆగస్ట్‌లో 2.07 శాతానికి చేరింది. కూరగాయలు, మాంసం, చేప లు, గుడ్లు, నూనెలు, ఫ్యాట్స్ ధరలు పెరగడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) తొమ్మిది నెలల పాటు వరుస క్షీణతకు ఆగస్ట్‌లో బ్రేక్ పడినట్టయింది. 2024 ఆగస్ట్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా ఉంది.
→ ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 0.69 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 1.76%గా ఉంది.
→ కూరగాయల ధరలు 15.92% పడిపోయాయి.
→ గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతంగా ఉంటే, ఆగస్ట్‌లో 1.69 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 2.47 శాతానికి చేరింది.
రానున్న నెలల్లో గమనించాలి..
ఆహారం, పానీయాల విభాగాల్లోని ధరల పెరుగుదల వల్లే సీక్వెన్షియల్‌గా (నెలవారీగా) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో పెరగడానికి కారణమని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. ఆగస్ట్ చివరి నుంచి సెపె్టంబర్ ఆరంభం వరకు అధిక వర్షాలు, వరదలు ఖరీఫ్ దిగుబడులపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతిమంగా దిగుబడి, ధరల తీరును గమనించాల్సి ఉందన్నారు.