
జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 1.55%
2017 జూన్ తర్వాత కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు మరింత కిందకు దిగొచ్చాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 1.55 శాతానికి పడిపోయింది. 2017 జూన్ నెలలో నమోదైన 1.46 శాతం తర్వాత ఇదే అత్యంత కనిష్ట రిటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది జూన్ నెలలో ద్రవ్యోల్బణం 2.1 శాతంతో పోల్చి చూసినా 0.55 శాతం తక్కువగా నమోదైంది.
2024 జూన్ నెలలో ఇది 3.6%గా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్నది వినియోగదారులతో పాటు విధాన నిర్ణేతలకూ ఉపశనమం కలిగిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
⇒ ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్/సీఎఫ్‌పీఐ) మైనస్ 1.76 శాతానికి క్షీణించింది. జూన్‌లో ఇది మైనస్ 1.01గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార విభాగంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఇది. వరి, గోధుమ, చక్కెర, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు ఈ విభాగం కిందకు వస్తాయి.
⇒ గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలకు 1.18 శాతంగా నమోదైంది. జూన్‌లో ఇది 1.72 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.74 శాతానికి పతనమైంది.
⇒ పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గింది.