
ఆరేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్‌లో 3.16 శాతానికి డౌన్
తగ్గిన కూరగాయలు, పండ్ల ధరలు
న్యూఢిల్లీ: మరో విడత కీలక పాలసీ రేట్ల కోత అంచనాలకు ఊతమిస్తూ ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాల ధరలు తగ్గడంతో 3.16 శాతానికి పరిమితమైంది. చివరిసారిగా 2019 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదైంది. జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన డేటా ప్రకారం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 3.34 శాతంగా, 2024 ఏప్రిల్‌లో 4.83 శాతంగాను ఉంది.
ఇక తాజా మార్చి డేటాతో పోలిస్తే ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 91 బేసిస్ పాయింట్లు తగ్గి 2.69 శాతం నుంచి 1.78 శాతానికి దిగి వచ్చింది. 2021 అక్టోబర్ తర్వాత మళ్లీ ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారి. 2024 ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.7 శాతంగా నమోదైంది. ‘కూరగాయలు, పప్పు ధాన్యాలు, పండ్లు, మాంసం..చేపలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి ధరలు తగ్గడంతో 2025 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గాయి‘ అని ఎన్‌ఎస్‌వో వెల్లడించింది. డేటా ప్రకారం ద్రవ్యోల్బణం తెలంగాణలో అత్యల్పంగా 1.26 శాతంగా, కేరళలో అత్యధికంగా 5.94 శాతంగా ఉంది.
రేట్ల కోత అంచనాలు..
ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో జూన్‌లో నిర్వహించే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం మీద అదనంగా 75 బేసిస్ పాయింట్లు (ముప్పావు శాతం) తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని (రెండు శాతం అటూ ఇటుగా) నాలుగు శాతానికి పరిమితం చేయడం లక్ష్యంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగానే ధరలు దిగి వస్తుండటంతో ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు విడతలుగా పాలసీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) తగ్గించింది.