2.76 లక్షల కొత్త కొలువులు

Retail, FMCG to add 2.76 lakh new jobs in April-September FY2019-20 - Sakshi

ఈ ఏడాది ప్రథమార్ధంలో రావచ్చని అంచనా

ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లోనే అత్యధికం

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ నివేదికలో వెల్లడి  

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్, ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. విదేశీ రిటైల్‌ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి పెద్ద యెత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ 2019–20 కాలానికి సంబంధించి ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం రిటైల్‌ రంగంలో నికరంగా ఉద్యోగావకాశాలు 2 శాతం పెరిగి అదనంగా 1.66 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఎఫ్‌ఎంసీజీలో 1 శాతం వృద్ధితో 1.10 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. 27,560 ఉద్యోగాలతో ఢిల్లీ రిటైల్‌ రంగం అగ్రస్థానంలో.. 22,770 కొత్త కొలువులతో బెంగళూరు ఆ తర్వాత స్థానంలో ఉంటాయి. విదేశీ రిటైల్‌ దిగ్గజాల రాకతో పాటు రిటైల్‌ రంగం భారీగా వృద్ధి చెందడం, కార్యకలాపాలు విస్తరించడం, కంపెనీల కొనుగోళ్లు జరగడం తదితర అంశాలు ఉపాధి కల్పనకు ఊతంగా నిలుస్తున్నాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ పేర్కొంది.

ఎఫ్‌ఎంసీజీలో ముంబై, ఢిల్లీ టాప్‌..
రిటైల్‌లో కొత్త కొలువులకు ఢిల్లీ, బెంగళూరు అగ్రస్థానాల్లో ఉండగా.. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ముంబై (14,770 కొత్త ఉద్యోగాలు), ఢిల్లీ (10,880) టాప్‌ స్థానాల్లో ఉంటాయి. ఫుడ్‌ పార్కుల ఏర్పాటు, సామర్థ్యాల పెంపు, ప్రస్తుత కంపెనీలు.. ఇతర సంస్థలను కొనుగోళ్లు చేయడం, క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం, సింగిల్, మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో ఆటోమేటిక్‌ రూట్‌లో పెట్టుబడులకు అనుమతించడం వంటి అంశాలు ఈ ఉపాధి కల్పనకు ఊతంగా ఉండగలవని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ హెడ్‌ (డిజిటల్, ఐటీ విభాగం)మయూర్‌ సారస్వత్‌ తెలిపారు. మొత్తం మీద చూస్తే రిటైల్‌ ద్వారా 15.11 శాతం, ఎఫ్‌ఎంసీజీ వల్ల 10.31% ఉద్యోగాల వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులకు మాత్రమే కాకుండా ఫ్రెషర్లకు కూడా బాగానే అవకాశాలు లభించగలవని సారస్వత్‌ తెలిపారు. కేవలం రిటైల్‌లోనే 33,310 తాజా గ్రాడ్యుయేట్స్‌కు కొత్తగా ఉద్యోగావకాశాలు లభించగలవన్నారు. నివేదిక ప్రకారం 2018–19 అక్టోబర్‌–మార్చి వ్యవధితో పోలిస్తే 2018–19 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో రిటైల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఉద్యోగుల వలసలు భారీగా నమోదయ్యాయి. రిటైల్‌లో 19.82 శాతంగాను, ఎఫ్‌ఎంసీజీలో 16.03 శాతంగాను ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top