
న్యూఢిల్లీ: కరెన్సీ కొరత నేపథ్యంలో దేశీ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఒక వెసులుబాటు కల్పించింది. చిన్న చిన్న పట్టణాల్లోని కస్టమర్లు రిటైల్ ఔట్‌లెట్స్‌లోని పీవోఎస్ మెషీన్ల ద్వారా రోజుకు రూ.2,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని, దీనికి ఎలాంటి చార్జీలూ ఉండవని తెలియజేసింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. టైర్–1, టైర్–2 పట్టణాల్లోని రిటైల్ ఔట్‌లెట్ల వద్ద ఉన్న పీవోఎస్ మెషీన్ల నుంచి రోజుకు ఒక కార్డు ద్వారా రూ.1,000 మాత్రమే విత్‌డ్రా చేసుకోగలం.
అదే టైర్–3 పట్టణాల్లో అయితే రూ.2,000 వరకు తీసుకోవచ్చు. ‘టైర్–3 నుంచి టైర్–6 పట్టణాల్లోని కస్టమర్లు ఎస్‌బీఐ, మరే ఇతర బ్యాంక్ డెబిట్ కార్డుతోనైనా రూ.2,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే టైర్–1, టైర్–2 పట్టణాల్లోని కస్టమర్లు రూ.1,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు’ అని ఎస్‌బీఐ డీఎండీ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) నీరజ్ వ్యాస్ ట్వీట్ చేశారు. కాగా ఎస్‌బీఐకి మొత్తంగా 6.08 లక్షల పీవోఎస్ మెషీన్లు ఉన్నాయి. ఇందులో 4.78 లక్షల మెషీన్లు నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.