
ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రపంచంలో అత్యంత పేద, అస్థిర దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎప్పుడూ యుద్ధం లేదా ఉగ్రవాద ఘటనలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాని కరెన్సీ బలం వల్ల ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ఈ దేశం కరెన్సీ పరంగా మాత్రం అత్యంత స్థిరమైన దేశాల్లో ఒకటిగా అవతరించడమంటే నిజంగా ఆశ్చర్యమే.
ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ ఎంత?
ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ (Afghanistan Currency) ఆఫ్ఘనీ (AFN). ప్రస్తుతం ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ.. భారత రూపాయి (Indian Rupee) కంటే బలంగా ఉంది. కరెన్సీ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్ XE.com ప్రకారం.. 1 ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ రూ.1.33 భారతీయ రూపాయలతో సమానం. ఇది అర్థం ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో 1 లక్ష ఆఫ్ఘనీలను సంపాదించడం, భారతదేశంలో సుమారు రూ.1.33 లక్షలకు సమానమవుతుంది. ఇది ఆర్థికంగా పోరాటం చేస్తున్న దేశానికి పెద్ద విషయమే.
ఆఫ్ఘన్ కరెన్సీ బలానికి కారణం
2021లో అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం, దేశీయ కరెన్సీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంది. అవి..
విదేశీ కరెన్సీ వినియోగంపై నిషేధం: ముఖ్యంగా అమెరికన్ డాలర్, పాకిస్తాన్ రూపాయి వాడకాన్ని ఆపివేశారు.
ఆఫ్ఘన్ కరెన్సీలో లావాదేవీలు తప్పనిసరి నిబంధన: ఇది స్థానిక కరెన్సీకి డిమాండ్‌ను పెంచింది.
ద్రవ్య విధానాల పటుత్వం: కఠిన ద్రవ్య విధానాల ద్వారా ద్రవ్యపు ప్రవాహాన్ని నియంత్రించారు.
కరెన్సీ స్థిరత్వం వెనుక వాస్తవం
ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదిగా ఉండవచ్చు. కానీ పరిమిత దిగుమతులు, చాలా తక్కువ విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం కారణంగా దాని కరెన్సీ స్థిరంగా ఉంది. దాదాపు ప్రతి దేశీయ లావాదేవీ స్థానిక కరెన్సీలో నిర్వహించడంతో, ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ విలువ పడిపోవడానికి బదులుగా స్థిరంగా ఉంటుంది.