
ముంబై: రిజర్వ్ బ్యాంక్ రూ. 2,000 నోట్లను ఉపసంహరించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ రూ. 5,956 కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉన్నాయి. ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. 2023 మే 19న ఈ పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజున మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2025 ఆగస్టు 31 నాటికి ఇది రూ. 5,956 కోట్లకు తగ్గినట్లు ఆర్‌బీఐ తెలిపింది.
98.33 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించినప్పటికీ, వాటిని రద్దు చేయలేదు కాబట్టి చలామణీలో ఉన్నవి చెల్లుబాటు అవుతాయి. ఈ నోట్లను బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. తమ ఖాతాల్లో జమ చేసుకునేందుకు ఇండియా పోస్ట్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లోని ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించవచ్చు.