
మరో రూ.1,000 పెరుగుదల
రూ.3,000 దిగొచ్చిన వెండి ధర
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో పసిడి ధరలు మరో సరికొత్త రికార్డును సృష్టించాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి బుధవారం మరో రూ.1,000 పెరిగి రూ.1,31,800 (పన్నులు సహా) స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కాస్తంత దిగొచ్చింది. కిలోకి రూ.3,000 తగ్గి రూ.1,82,000 (పన్నులు సహా) వద్ద స్థిరపడింది. మంగళవారం వెండి కిలోకి రూ.6,000 పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట ధర రూ.1,85,000ను నమోదు చేయడం తెలిసిందే. పండుగల సీజన్ కావడంతో రిటైలర్లు, జ్యుయలర్ల కొనుగోళ్లతో పసిడి ధరలు పెరిగినట్టు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ తెలిపింది.
‘‘అంతర్జాతీయంగా బలమైన ర్యాలీ, దేశీయంగా భౌతిక బంగారం కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ తోడవడంతో బంగారం ధర మరో నూతన రికార్డు గరిష్టానికి చేరింది. రూపాయి బలపడడం ధరల ర్యాలీకి కీలక అవరోధంగా వ్యవహరించింది. దీంతో దేశీ మార్కెట్లో ధరల పెరుగుదల పరిమితమైంది. మొత్తం మీద బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. పండుగల కొనుగోళ్లతో ఇదే ధోరణి కొనసాగుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు.