
ప్రపంచ వృద్ధి మందగమనానికి "అనిశ్చితి, రక్షణవాదం" వంటి హెడ్‌విండ్స్ (ప్రతికూల ప్రభావాలు) కారణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) పేర్కొంది. అయినప్పటికీ, వాణిజ్య సుంకాల వల్ల వచ్చే ప్రభావం "మొదట భావించిన దానికంటే తక్కువగా ఉందని" సంస్థ విశ్లేషించింది.
"ప్రధాన విధాన మార్పులు ఉన్నప్పటికీ, ప్రపంచ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. సుంకాల పెరుగుదల ప్రభావం ఊహించిన దానికంటే తక్కువగా ఉండటం వెనుక, కొత్త వాణిజ్య ఒప్పందాలు, బహుళ మినహాయింపులు, సరఫరా గొలుసులను పునఃఆయోజనం చేయడంలో ప్రైవేట్ రంగం చురుకుదనం ముఖ్య పాత్ర పోషించాయి" అని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియరీ-ఒలివర్ గౌరించాస్ పేర్కొన్నారు.
భారత జీడీపీ అంచనాలు పెంచిన ఐఎంఎఫ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా అంచనా ప్రకటించింది. గత అంచనా అయిన 6.4 శాతాన్ని ఎగువకు పెంచింది. 2026–27 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 0.20 శాతం తగ్గిస్తూ 6.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
అమెరికా టారిఫ్‌ల ప్రభావాలకు మించి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బలమైన వృద్ధి నమోదు కావడాన్ని తమ అంచనాల పెంపునకు కారణంగా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందడం గమనార్హం.
ప్రపంచ వృద్ధి 2024లో నమోదైన 3.3 శాతం నుంచి 2025లో 3.2 శాతానికి, 2026లో 3.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వర్ధమాన, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి సైతం 2024లో నమోదైన 4.3 శాతం నుంచి 2025లో 4.2 శాతానికి, 2026లో 4 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది.