కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్‌ | Realty Act rollout from May 1, but states yet to frame rules | Sakshi
Sakshi News home page

కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్‌

May 1 2017 12:28 AM | Updated on Sep 5 2017 10:04 AM

కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్‌

కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్‌

రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ అభివృద్ధి చట్టం – 2016 మే 1 నుంచి (సోమవారం) అమల్లోకి వస్తోంది.

► కొనుగోలుదారులు మోసపోకుండా రక్షణ
►  చిన్న డెవలపర్లకు కష్టకాలమే
►  స్వల్ప కాలం పాటు ధరలు స్థిరంగానే
►  ఆర్‌ఈఆర్‌ఏపై పరిశ్రమ వర్గాలు


న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ అభివృద్ధి చట్టం – 2016 మే 1 నుంచి (సోమవారం) అమల్లోకి వస్తోంది. ఈ చట్టం (ఆర్‌ఈఆర్‌ఏ) రాకతో గృహాలకు డిమాండ్‌ తిరిగి పుంజుకుంటుందని డెవలపర్లు భావిస్తున్నారు. ఈ చట్టం నిబంధనలను పాటించని అమ్మకందారుల నుంచి కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందంటున్నారు.

విక్రయం కాని యూనిట్లు అధిక సంఖ్యలో ఉన్నందున ధరలు స్థిరంగా కొనసాగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లకు సంబంధించి రెండు అత్యున్నత సంస్థలైన క్రెడాయ్, నరెడ్కో నూతన చట్టం దేశీయ రియల్టీ రంగ పనితీరును మార్చేస్తుందని పేర్కొన్నాయి. మొదట్లో చిన్న చిన్న సమస్యలుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులను చట్టం నుంచి మినహాయించాలని కోరినప్పటికీ ప్రభుత్వం వాటికి చోటు కల్పించలేదు.

రూపు రేఖలను మార్చేస్తుంది...
‘‘రియల్‌ ఎస్టేట్‌ రంగం రూపురేఖలను మార్చేస్తుంది. కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుంది. గతంలో ఫ్లాట్స్‌ కొన్నవారికీ ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది. ఆర్‌ఈఆర్‌ఏ పరిధిలో నియంత్రణ సంస్థ ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు ఉన్న మార్గాలను అన్వేషించడం ద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు ఉపశమనం కల్పిస్తుంది’’ అని నరెడ్కో చైర్మన్‌ రాజీవ్‌ తల్వార్‌ పేర్కొన్నారు.

పారదర్శకత...: ‘‘ఆర్‌ఈఆర్‌ఏ ఈ రంగంలో పారదర్శకతను పెంచుతుంది. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది’’ అని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ జక్సయ్‌షా అన్నారు. ఈ ఏడాది సరఫరా తగ్గుతుందని, అదే సమయంలో ప్రాపర్టీ మార్కెట్‌ పట్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరగడం వల్ల డిమాండ్‌ పుంజుకుంటుందన్నారు. రానున్న ఆరు నెలల్లో 10 శాతం వరకు ధరలు పెరగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భవిష్యత్‌ వృద్ధికి మార్గం: ‘‘ఈ చట్టం దేశీయ రియల్‌ ఎస్టేట్‌రంగ భవిష్యత్‌ వృద్ధికి కీలకం. పారదర్శకతతో ఈ రంగాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇళ్ల కొనుగోలు దారులు ఊపిరిపీల్చుకుని నమ్మకంగా పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం వచ్చింది. నియమాలు పాటించని చిన్న బిల్డర్లు, పెద్ద వారు సైతం కొనుగోలుదారులను ఇబ్బందులు పెట్టేందుకు అవకాశం ఉండదు’’ అని జేఎల్‌ఎల్‌ రెసిడెన్షియల్‌ సంస్థ చైర్మన్‌ అనుజ్‌పురి పేర్కొన్నారు.

చిన్న డెవలపర్లకు కష్టమే
‘‘అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారు, చిన్న చిన్న డెవలపర్లు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తమ వ్యాపారాలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. ఆర్‌ఈఆర్‌ఏ రాకతో కొనుగోలు దారులు ప్రాజెక్టులు ఆగే అవకాశం లేని బ్రాండెడ్‌ ప్రాజెక్టుల వైపు చూస్తారు. ఈ నేపథ్యంలో అవ్యవస్థీకృత నిర్వాహకులు, చిన్న స్థాయి నిర్వాహకులు నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. అయితే, ఇందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది’’ అని టాటా హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌ మార్కెటింగ్‌ సేవల హెడ్‌ రాజీబ్‌దాస్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement