మా దగ్గర ఇన్వెస్ట్‌ చేయండి..

PM Narendra Modi Invites Saudi Arabia Investment In India - Sakshi

ఇంధన, మౌలిక రంగాల్లో అపార అవకాశాలు 

సౌదీ కంపెనీలకు  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు 

ప్రపంచ ఎకానమీకి భారత్‌ కీలకమని వెల్లడి 

రియాద్‌: వచ్చే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకున్న భారత్‌లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ సౌదీ అరేబియా కంపెనీలను ఆహ్వానించారు. ఈ రంగంలో 100 బిలియన్‌ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్‌ పెట్టుబడుల సదస్సు(ఎఫ్‌ఐఐ) 2019లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. మౌలిక రంగంపై రూ. 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రా రంగంలో కూడా ఇన్వెస్ట్‌ చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులను కల్పించే క్రమంలో పన్ను రేట్లను, మేధోహక్కుల విధానాలను సంస్కరించినట్లు చెప్పారు. నైపుణ్యాలను మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని.. వచ్చే 3–4 ఏళ్లలో 40 కోట్ల మందిని వివిధ రంగాల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దనున్నామని ఆయన పేర్కొన్నారు.  

విధానాల్లో అసమానతలతోనే అనిశ్చితి.. 
భారత్, సౌదీ అరేబియా వంటి భారీ వర్ధమాన దేశాల దిశపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆధారపడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. బహుళపక్ష వాణిజ్య విధానాల్లో అసమానతల వల్లే ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘భారత్‌ వంటి పెద్ద వర్ధమాన దేశాల బాటపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎక్కువగా ఆధారపడి ఉంది. గత నెల ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో కూడా చెప్పినట్లు.. సమష్టిగా వృద్ధి సాధించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నాం.

జీ20 కూటమిలో.. అసమానతలు తగ్గించేందుకు, నిలకడగా అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భారత్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక మందగమన ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. భారత్, సౌదీ అరేబియా ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టాయని చెప్పారు. ‘వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొల్పేందుకు, ప్రపంచ వృద్ధికి .. స్థిరత్వానికి చోదకంగా నిల్చేందుకు భారత్‌ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. సౌదీ అరేబియా కూడా తమ విజన్‌ 2030 సాధనలో భాగంగా సంస్కరణల ఎజెండాను అమలు చేస్తుండటం సంతోషించదగ్గ విషయం‘ అని ప్రధాని చెప్పారు. 

15 బిలియన్‌ డాలర్ల డీల్స్‌ 
మూడు రోజుల ఎఫ్‌ఐఐ సదస్సులో భాగంగా తొలిరోజున సుమారు 15 బిలియన్‌ డాలర్ల విలువ చేసే 23 పెట్టుబడి ఒప్పందాలు కుదిరినట్లు సౌదీ అరేబియన్‌ జనరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఎస్‌ఏజీఏఐ) వెల్లడించింది. తమ దేశంలో పెట్టుబడులకు గల భారీ అవకాశాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. విజన్‌ 2030లో భాగంగా సౌదీ అరేబియా భారీ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తోందని ఎస్‌ఏజీఐఏ గవర్నర్‌ ఇబ్రహీం అల్‌–ఒమర్‌ తెలిపారు.

మందగమనం తాత్కాలికం: ముకేశ్‌ అంబానీ
భారత్‌లో మందగమనం తాత్కాలికమని, ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంస్కరణలతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడగలవని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ తెలిపారు. ‘భారత ఎకానమీ స్వల్పంగా మందగించింది. కానీ, ఇది తాత్కాలికమే. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాలనిస్తాయి. వచ్చే క్వార్టర్‌ నుంచి మందగమన ధోరణి కచ్చితంగా మారుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, యువ జనాభా, నాయకత్వం వంటి అంశాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నాయని .. వృద్ధి సాధనకు ఇవి దోహదపడగలవని పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా అంబానీ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top