పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఊరట?

Petrol Breaches Rs 80 Mark In Delhi; Relief On The Cards This November - Sakshi

న్యూఢిల్లీ : సామాన్యులకు పెట్రో వాత మారుమోగిపోతుంది. గత నెల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుతూనే ఉన్నాయి, తప్ప అసలు తగ్గడం లేదు. స్కై రాకెట్‌లాగానే ఈ ధరలు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల ఎఫెక్ట్‌, పన్నులు దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి లీటరుకు రూ.80 మార్కును దాటిపోయింది. శనివారం ఒక్క రోజులోనే లీటరు పెట్రోల్‌ ధర 39 పైసలు పెరిగి, రూ.80.38గా నమోదైంది. డీజిల్‌ ధరలు కూడా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. లీటరు డీజిల్‌ ధర కూడా 44 పైసలు పెరిగి రూ.72.51గా ఉంది. ముంబైలో కూడా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు రూ.87.77గా, రూ.76.98గా ఉన్నాయి. ఈ మేర సెగపుట్టిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరో రెండు నెలల్లో మనకు ఊరటనియనున్నాయట. రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, ఈ ధరల్లో మార్పులు చేపట్టకపోవచ్చని తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల సమయంలో కూడా 20 రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు చూడలేదు. కానీ కర్ణాటక ఎన్నికలు అయిపోగానే, ఈ ధరలు ఒక్కసారిగా రయ్‌మని పైకి ఎగిశాయి.

గత ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్‌ 1 మధ్యలో కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలాంటి మార్పులు లేకుండా.. అదే విధంగా ఉన్నాయి. ఆ సమయంలో పంజాబ్‌, గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, మణిపూర్‌ ఎన్నికలు ఉండటమే కారణం. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీష్‌గడ్‌, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ఏడాది ముగింపునఎన్నికలకు వెళ్లబోతున్నాయి. తెలంగాణకు కూడా ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలను నిర్వహించబోతుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో కస్టమర్లకు కాస్త ఊరటనిస్తూ... పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఈ నవంబర్‌ నుంచి ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓ వైపు ప్రతిపక్షాల నుంచి వస్తున్న తీవ్ర నిరసన.. మరోవైపు త్వరలో జరుగబోతున్న రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నవంబర్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు బ్రేక్‌ ఇవ్వాలని భావిస్తోంది కేంద్రం.  తద్వారా ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకుని, ఓట్లను క్యాష్‌ చేసుకోబోతుంది.

 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top