డీఎంకే అంటే అవినీతి, మాఫియా, నేరాలు
బహిరంగ సభలో మోదీ ఆగ్రహం
డీఎంకే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని వెల్లడి
మధురాంతకం(తమిళనాడు): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సీఎంసీ(కరప్షన్, మాఫియా, క్రైమ్) సర్కార్ రాజ్యమేలుతోందని మండిపడ్డారు. అవినీతి, మాఫియా, నేరాలకు డీఎంకే పర్యాయ పదంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేకు గట్టిగా బుద్ధి చెప్పాలని తమిళనాడు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. సీఎంసీని ఎవరూ సహించబోరని అన్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం తమిళనాడులోని మధురాంతకంలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రజలతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.
అన్నా డీఎంకే అధ్యక్షుడు ఎడప్పాడి పళనిస్వామి, అమ్మ మక్కల్ కట్చి కళగం(ఏఎంఎంకే) అధినేత టీటీవీ దినకరన్, పీఎంకే నాయకుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, టీఎంసీ–ఎం నేత జీకే వాసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు. అరాచక పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సుపరిపాలన కోసం వారంతా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి
డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తిరుప్పరకుండ్రంలో ఇటీవల జరిగిన కార్తీక దీప వివాదాన్ని ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను కూడా డీఎంకే లెక్కచేయడం లేదని ఆక్షేపించారు. భక్తుల హక్కుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. డీఎంకేలో ఎవరైనా పైకి ఎదగాలంటే వారసత్వం, అవినీతి, మహిళలపై వేధింపుల్లో ప్రమేయం ఉండాలని ఎద్దేవా చేశారు. మన సంస్కృతిని అవమానించేవారికి ఆ పార్టీలో పెద్దపీట వేస్తుంటారని విమర్శించారు.
డీఎంకే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం అంటే ఇష్టం ఉండదని చెప్పారు. కేవలం ఒక్క కుటుంబం కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. తమిళనాడులో ఎంత అవినీతి జరిగిందో, ఎవరికి జేబుల్లోకి ఎంత సొమ్ము వెళ్లిందో చిన్నపిల్లలకు కూడా తెలుసని పేర్కొన్నారు. డీఎంకే కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి మనమంతా ఒక్కటి కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సూచించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రంతో భుజం భుజం కలిపి పనిచేసే ప్రభుత్వం కావాలన్నారు. డీఎంకే పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆక్షేపించారు. డ్రగ్స్, నేరాలు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదన్నారు. యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో చిక్కుకున్నారని, మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు నేరాలను కట్టడి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం డీఎంకే పాలనలో ప్రజలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.


