2033 నాటికి ముకేశ్‌ సంపద.. లక్ష కోట్ల డాలర్లు!

Mukesh Ambani could be a trillionaire in 2033 - Sakshi

2026 నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా అమెజాన్‌ బెజోస్‌

కంపేరిజన్‌ అధ్యయన నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం, దేశీ కుబేరుడు ముకేశ్‌ అంబానీ మరో దశాబ్ద కాలంలో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. 2033 నాటికి 75 ఏళ్ల వయసులో.. ఏకంగా 1 లక్ష కోట్ల (ట్రిలియన్‌) డాలర్ల సంపదతో ట్రిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ గణాంకాల ప్రకారం ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ సంపద ప్రస్తుతం సుమారు 53.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వివిధ వ్యాపారాలపై తులనాత్మక అధ్యయనం చేసే కంపేరిజన్‌ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం 2026 నాటికి అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ తొలి ట్రిలియనీర్‌ హోదా అందుకోనున్నారు. 145 బిలియన్‌ డాలర్ల సంపదతో జెఫ్‌ బెజోస్‌ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చలామణీ అవుతున్నారు. గడిచిన అయిదేళ్లలో ఆయన సంపద సగటున 34 శాతం మేర పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు, సంపన్న కంపెనీల చారిత్రక వేల్యుయేషన్లను అధ్యయనం చేయడం ద్వారా ఎవరు, ఎప్పుడు ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరతారనేది కంపేరిజన్‌ అంచనా వేసింది.  
 
రెండో ట్రిలియనీర్‌గా చైనా రియల్టర్‌..
జెఫ్‌ బెజోస్‌ తర్వాత చైనాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం జు జియాయిన్‌ 2027 నాటికి ప్రపంచంలోనే రెండో ట్రిలియనీరుగా ఎదగనున్నారు. అప్పటికాయన వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఇక చైనాకే చెందిన మరో దిగ్గజ సంస్థ ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా,  సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తదితరులు కూడా వచ్చే దశాబ్దం, దశాబ్దన్నర కాలంలో ట్రిలియనీర్ల లిస్టులో చోటు దక్కించుకోనున్నారు.  

కంపేరిజన్‌ మొత్తం 25 మంది కుబేరులపై అధ్యయనం చేయగా, ఇటీవలి కాలంలో వారి సంపద వృద్ధి రేటును బట్టి చూస్తే.. కేవలం 11 మందే తమ జీవితకాలంలో ట్రిలియనీర్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సే్చంజీలో అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గల 25 లిస్టెడ్‌ కంపెనీలు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 25 మంది వ్యక్తులకు సంబంధించి గత అయిదేళ్ల డేటాను కంపేరిజన్‌ పరిగణనలోకి తీసుకుంది. గత అయిదేళ్లలో సంపద వృద్ధి చెందిన తీరు ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో పెరుగుదలను లెక్కగట్టడం ద్వారా .. ట్రిలియనీర్ల జాబితాపై ఒక అంచనా రూపొందించే ప్రయత్నం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top