దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు | More Income Through Longtime Invetsments Multicap Mutual Funds | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు

May 20 2019 8:18 AM | Updated on May 20 2019 8:18 AM

 More Income Through Longtime Invetsments  Multicap Mutual Funds - Sakshi

గత కొంతకాలంగా మల్టీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ప్రతీ ర్యాలీలో పాల్గొంటాయని చెప్పలేని పరిస్థితి. కానీ, ర్యాలీ మొదలు పెట్టాయా, అధిక రాబడుల దిశగా పరుగులు తీస్తుంటాయి. మరోవైపు బ్లూచిప్‌ కంపెనీలు మాత్రం మార్కెట్‌ ర్యాలీ, కరెక్షన్లలోనూ తప్పకుండా ముందుంటాయి. ఈ విధంగా అన్ని రకాల మార్కెట్‌ క్యాప్‌తో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలు కల్పించేవే మల్టీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌. తద్వారా అన్ని విభాగాల్లోని నాణ్యమైన స్టాక్స్‌లో పెట్టుబడులపై మంచి రాబడులను ఇన్వెస్టర్లకు అందించేందుకు ఫండ్‌ మేనేజర్లు ఈ పథకాల ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపుతున్న పథకాల్లో ఐసీఐసీఐ  ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ కూడా ఒకటి. 

రాబడులు..
ఈ పథకం రాబడుల్లో స్థిరత్వాన్ని గమనించొచ్చు. ఒక్క మూడేళ్ల కాలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఈ పథకం రాబడులకు బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐను ప్రామాణికంగా చూస్తారు. ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ 4.86 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్ల కాలంలో 12.65 శాతం, ఐదేళ్ల కాలంలో 13.47 శాతం, పదేళ్ల కాలంలో 15.53 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ రాబడులు ఏడాది కాలంలో 1.25 శాతం, మూడేళ్లలో 13.49 శాతం, ఐదేళ్లలో 11.91 శాతం, పదేళ్లలో 14.31 శాతం చొప్పున ఉన్నాయి.  

పెట్టుబడుల విధానం 

మల్టీక్యాప్‌ పథకాల్లో మరో వెసులుబాటు కూడా ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం బ్లూచిప్‌ కంపెనీల వ్యాల్యూషన్లు పదేళ్ల సగటు పీఈ కంటే ఎక్కువే ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్‌ మాత్రం గత ఏడాదికి పైగా దిద్దుబాటు దశలో ఉండి ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లకు చేరాయి. మల్టీక్యాప్‌ ఫండ్‌ మేనేజర్లు చౌక వ్యాల్యూషన్లకు చేరిన మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎక్స్‌పోజర్‌ పెంచుకుని, లార్జ్‌క్యాప్‌లో తగ్గించుకోవచ్చు. అలాగే, మిడ్, స్మాల్‌క్యాప్‌ వ్యాల్యూషన్లు అధిక స్థాయిలకు చేరాయని భావించినప్పుడు తిరిగి వాటిల్లో పెట్టుబడులను కుదించుకుని, లార్జ్‌క్యాప్‌లో పెంచుకోవచ్చు. ఐసీఐసీఐ మల్టీక్యాప్‌ పథకం ప్రధానంగా ప్రముఖ లార్జ్‌క్యాప్‌తోపాటు, మిడ్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ఇంటర్నల్‌ మార్కెట్‌ క్యాప్‌ విధానాన్ని పాటిస్తుంది. ఆర్థిక రంగం రికవరీతో ఎక్కువగా ప్రయోజనం పొందే రంగాల స్టాక్స్‌లో ప్రస్తుతం ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసింది.

ప్రధానంగా ప్రభుత్వరంగ కంపెనీల (పీఎస్‌యూ) వ్యాల్యూషన్లు చారిత్రకంగా కనిష్ట స్థాయిలకు చేరాయి. దీంతో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్టాక్స్‌లో ర్యాలీకి అవకాశం ఉంటుందన్న అంచనాతో ప్రభుత్వరంగ కంపెనీలను పోర్ట్‌ఫోలియోకి చేర్చింది. వ్యాల్యూషన్ల పరంగా ఆకర్షణీయంగా ఉన్న కార్పొరేట్‌ బ్యాంకుల్లోనూ ఇన్వెస్ట్‌ చేసింది. టెలికంలోనూ ఎక్స్‌పోజర్‌ తీసుకుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 69 స్టాక్స్‌ ఉన్నాయి. 76 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకు కేటాయించగా, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 19 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 5 శాతం వరకు కేటాయింపులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement