
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తాజాగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మోడల్ ఆధారంగా రూ. 1.12 లక్షల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. విటారా బ్రెజా, స్విఫ్ట్, డిజైర్, సియాజ్ కార్లకు ఈ స్థాయి వరకు డిస్కౌంట్ వర్తిస్తుందని వివరించింది. విటారా బ్రెజాకు కస్టమర్ ఆఫర్ రూ. 50,000, ఎక్సే్ఛంజ్ ఆఫర్ రూ. 20,000, కార్పొరేట్ ఆఫర్ రూ. 10,000, ఐదేళ్ల వారెంటీ కలుపుకుని మొత్తంగా రూ. 1.01 లక్షల వరకు డిస్కౌంట్ ఉన్నట్లు తెలియజేసింది. ఇదే తరహాలో అన్ని వాహనాలకు ఆఫర్ ఉన్నట్లు స్పష్టంచేసింది. ఆల్టో, ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్లకు రూ.65,000 వరకు ఆఫర్ ప్రకటించింది. స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌కు రూ. 50,000 డిస్కౌంట్.. డీజిల్ వేరియంట్‌కు రూ.77,700 డిస్కౌంట్ ఇస్తోంది. డిజైర్ పెట్రోల్ వేరియంట్‌కు రూ. 30,000 తగ్గింపు.. డీజిల్ వేరియంట్‌కు రూ. 20,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఈకో సెవన్ సీటర్ డిస్కౌంట్ రూ. 25,000 ఉండగా.. బాలెనో, సియాజ్ కార్లకు ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.