ఐఫోన్‌ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్‌, యూజర్లు గగ్గోలు

iPhone X Dual Camera Glass Cracks Easily, Some Users Report - Sakshi

ఐఫోన్‌ ఎక్స్‌.. ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్‌ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్‌ ఎడిషన్‌. కానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్‌ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా వెనుక వైపు గల డ్యూయల్‌ కెమెరాకు అమర్చిన గ్లాస్‌ ప్రొటెక్షన్‌ అనుకోకుండా పగిలిపోతుందట. ఈ విషయంపై యూజర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్రారంభమైంది. రెడ్డిట్‌, ఆపిల్‌ సపోర్టు ఫోరమ్స్‌ల్లో పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ఐఫోన్‌ యూజర్లు తమ కెమెరా గ్లాస్‌ పగిలిపోతుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్‌ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు. 

‘నా ఐఫోన్‌ ఎక్స్‌ కెమెరా లెన్స్‌ పగిలిపోయినట్టు ఇప్పుడే చూశా. కానీ నేనసలు ఈ ఫోన్‌ను కిందనే పడేయలేదు’ అని ఒక యూజర్‌ రెడ్డిట్‌లో రిపోర్టు చేశాడు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్‌ వెనుక వైపు కెమెరా గ్లాస్‌ ప్రొటెక్షన్‌​ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో ఉన్నందుకు వెనుక వైపు కెమెరా గ్లాస్‌ పగులుతుందని రిపోర్టులు వస్తున్నాయని, తాను మలేషియాలో ఉంటానని, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అయితే ఇక్కడ ఏ కారణం చేత పగిలింది అని ఓ బాధిత యూజర్‌ ఆపిల్‌ సపోర్టు ఫోరమ్‌కు లేఖ రాశారు. తమ వద్ద 32-36 సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొన్నారు. ​ఐఫోన్‌ ఎక్స్‌తో పాటు యూజర్లు తన పాకెట్లలో మరికొన్ని వస్తువులను పెట్టుకుని ఉంటుండటంతో, కెమెరా గ్లాస్‌ పగులుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్‌ 7 నుంచి ఆపిల్‌ తన ఐఫోన్‌ మోడల్స్‌కు సఫైర్‌ గ్లాస్‌ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు. అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top