ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ ఇక ఇక్కడిదే కొనుకోవచ్చు!

iPhone 6S Plus Manufacturing In India Could Start Soon - Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగ్గజం ఆపిల్ భారత్‌లో తయారు చేస్తున్న ఏకైక ఫోన్ ఐఫోన్ ఎస్ఈ. ప్రస్తుతం ఐఫోన్‌ ఎస్‌ఈతో పాటు మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆపిల్‌ భారత్‌లో తయారు చేయబోతోంది. అదే ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌. ఆపిల్‌ మరో రెండు వారాల్లో ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను బెంగళూరులో తయారుచేయడం ప్రారంభించబోతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే దీని ట్రయల్‌ ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్టు తెలిపాయి. దీంతో ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ ధరను ఆపిల్‌ 5 శాతం నుంచి 7 శాతం మేర తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత్‌లో అత్యంత పాపులర్‌ అయిన ఐఫోన్లలో ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ ఒకటి. ఈ ఫోన్‌ ట్రయల్‌ ప్రొడక్షన్‌ను బెంగళూరులోని విస్ట్రోన్‌లో ఆపిల్‌ ప్రారంభించేసింది. పూర్తిగా తయారీ ప్రారంభించిన అనంతరం వెంటనే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గుదలను కంపెనీ చేపట్టదని, స్థానిక సామర్థ్యం పెంచిన తర్వాతనే ధరల తగ్గుదలను చేపడుతుందని ఓ సీనియర్‌ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. భారత్‌ మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను వెంటనే విస్ట్రోన్‌ చేరుకోలేకపోవడమే దీనికి కారణమన్నారు. చైనా నుంచి ఈ ఫోన్‌ దిగుమతులు కొనసాగుతాయని తెలిపారు.

కాగ, గతేడాది మే నుంచి ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆపిల్‌ భారత్‌లో రూపొందిస్తోంది.  ఈ ఫోన్‌ ప్రస్తుతం అత్యంత తక్కువగా రూ.18,799కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు ఇప్పడికీ మంచి స్పందనే వస్తోంది. పలుసార్లు ధరలు తగ్గించిన అనంతరం ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉంచింది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ తయారీని కూడా భారత్‌లో ప్రారంభించిన అనంతరం, వెంటనే ధర తగ్గుదల చేపడుతుందని తెలుస్తోంది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ ప్రస్తుతం ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రూ.37,999కు లభ్యమవుతోంది. ఆపిల్‌ ప్రస్తుతం ఫ్లెక్స్‌, ఫాక్స్‌కాన్‌, విస్ట్రోన్‌ వంటి తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతోందని, దీంతో తన స్థానిక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటుందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. ఛార్జర్లు, అడాప్టర్లు, ప్యాకింగ్‌ బాక్స్‌ల తయారీని కూడా భారత్‌లోనే ఆపిల్‌ చేపట్టబోతుందని తెలుస్తోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top