మళ్లీ డిఫాల్టయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌

IL&FS Financial Services defaults on commercial papers - Sakshi

ముంబై: ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చెల్లింపుల సంక్షోభం మరింత ముదురుతోంది. వాణిజ్య పత్రాలపై వడ్డీ చెల్లింపుల్లో ఈ కంపెనీ మరోసారి విఫలమైంది. సోమవారం చెల్లించాల్సిన వడ్డీని తాము చెల్లించలేకపోయినట్లు ఈ కంపెనీ స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. అయితే ఎంత మొత్తం చెల్లించటంలో విఫలమయ్యారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

చెల్లింపుల్లో విఫలం కావడం ఈ గ్రూప్‌కు ఈ నెలలో ఇది మూడో సారి. ‘సిడ్బీ’ నుంచి తీసుకున్న రూ.1,000 కోట్ల స్వల్పకాలిక రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ విఫలమైంది. ఈ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ ఒకటి రూ.500 కోట్ల రుణ చెల్లింపులో కూడా విఫలమైంది. కాగా రుణ చెల్లింపులు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సంబంధిత అంశాలపై ఆరోపణలు రావడంతో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రమేశ్‌ సి బావా, కొందరు కీలకమైన బోర్డ్‌ సభ్యులు గత శుక్రవారం రాజీనామా చేశారు.  

రూ.91,000 కోట్ల రుణ భారం...
కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ.91,000 కోట్లుగా ఉన్నట్లు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ నొముర ఇండియా తెలియజేసింది.  ఈ రుణంలో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ కంపెనీ వాటా రూ.35,000 కోట్లని, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌  ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వాటా రూ.17,000 కోట్లుగా ఉంటుందని వివరించింది.

తనే పరిష్కరించుకుంటుంది: గర్గ్‌   
న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్‌ అయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) తన సమస్యలను తానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ వ్యాఖ్యానించారు. ‘ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ప్రభుత్వ ప్రమేయమేమీ లేదు. దానికంటూ స్వతంత్ర బోర్డు, షేర్‌హోల్డర్లు ఉన్నారు. కాబట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఆ సమర్ధత ఉందనే నేను భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు.

ఆస్తులు, అప్పుల మధ్య తాత్కాలిక వ్యత్యాసం ఏర్పడవచ్చని.. కానీ అంతిమంగా ఆ సంస్థే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని గర్గ్‌ చెప్పారు. ఇందులో ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయమేమీ లేదని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో కేంద్రానికి నేరుగా వాటాలేమీ లేకపోయినప్పటికీ.. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు వాటాలు ఉన్నాయి.

ఎల్‌ఐసీకి నాలుగో వంతు వాటా ఉండగా, జపాన్‌కి చెందిన ఓరిక్స్‌ కార్పొరేషన్‌కు 23.5 శాతం, ఎస్‌బీఐకి 6.42 శాతం, హెచ్‌డీఎఫ్‌సీకీ 9 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 7.67 శాతం మేర వాటాలు ఉన్నాయి. సిడ్బి నుంచి తీసుకున్న రూ. 1,000 కోట్ల స్వల్పకాలిక రుణాలను చెల్లించలేక ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ అయిందన్న సంగతి సెప్టెంబర్‌ 4న బైటపడిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top