ఆర్థిక సంక్షోభమా?...ఆర్థిక సంస్థలతోనే సరా?

IL&FS crisis: Why it should not become India's Lehman moment - Sakshi

వ్యవస్థను చుట్టుముడుతున్న ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం

ఈ సంస్థ మొత్తం రుణాలు రూ. 90 వేల కోట్లు

రెండు నెలలుగా డిఫాల్టవుతున్నా బయటపడని తీరు

సిడ్బీకి చెల్లింపుల్లో డిఫాల్ట్‌తో వ్యవహారం బయటకు

మరింత పెట్టుబడితో ఆదుకుంటామన్న ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ

లేమన్‌ సంక్షోభంతో దీన్ని పోల్చలేమంటున్న నిపుణులు

లిక్విడిటీ సమస్య భయంతోనే ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల అమ్మకాలు

వీటి ఆస్తులూ... అప్పులకన్నా తక్కువుండొచ్చనే సందేహాలు

బ్యాంకుల ఎన్‌పీఏలు మరింతగా పెరిగే అవకాశం

కొద్దిరోజులు ఆగితే తప్ప ఏమీ చెప్పలేమంటున్న నిపుణులు  

తీసుకున్న రుణాల్లో రూ.100 కోట్లను చెల్లించటంలో డిఫాల్టయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం... అంతకంతకూ విస్తరిస్తూ విశ్వరూపం చూపిస్తోంది. లిక్విడిటీ సమస్య, డిఫాల్టింగ్, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌.. ఇలా గొలుసుకట్టు చర్యలు ఆరంభమై వైరస్‌లా బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగాలకూ పాకింది. ఆయా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తటంతో కొన్నిరోజులుగా స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. కొందరు దీన్ని పదేళ్ల కిందటి లేమన్‌ బ్రదర్స్‌ సంక్షోభంతో పోలుస్తుండగా... మరికొందరు ఎన్‌బీఎఫ్‌సీలకు ఇది తీవ్రమైన దెబ్బగా చెబుతున్నారు. అసలు వీటిలో నిజాలెన్ని? నిపుణులేమంటున్నారు? 2008 నాటి పరిస్థితులు ఇపుడున్నాయా? ఎన్‌బీఎఫ్‌సీల సంగతేంటి? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం... 

(సాక్షి, బిజినెస్‌ విభాగం)  జూన్‌లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థ ఐటీఎన్‌ఎల్‌ (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌) డిఫాల్టయింది. కానీ ఆ సమయంలో రేటింగ్‌ ఏజెన్సీలు ఐటీఎన్‌ఎల్‌ బాండ్లకు డిఫాల్ట్‌ రేటింగ్‌ ఇవ్వలేదు. కంపెనీ వెనుక బడా గ్రూప్‌ ఉందనే భరోసాతో దీన్ని పట్టించుకోలేదు. దీంతో సమస్య ముదిరింది. సెప్టెంబర్‌కు వచ్చేసరికి మాతృసంస్థ ఐఎల్‌ఎఫ్‌ఎస్‌... సిడ్బీకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించలేక డిఫాల్టయింది. ఉలిక్కిపడ్డ రేటింగ్‌ ఏజెన్సీలు ఆదరాబాదరాగా ఈ గ్రూప్‌ బాండ్స్‌కు జంక్‌ రేటింగ్‌ ఇచ్చాయి.  

ఆ ఐదే అసలు కారణం? 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌లో అనుబంధ సంస్థలు తమిళనాడు పవర్‌ కంపెనీ, మారిటైమ్‌ ఇన్‌ఫ్రా, రాపిడ్‌ మెట్రోరైల్‌ గుర్గావ్‌ సౌత్, చెనాని నష్రి టన్నెల్‌వే కీలక పాత్ర పోషించాయి. రెండు అనుబంధ కంపెనీలు, ఒక మెట్రో ప్రాజెక్టు, ఒక టన్నెల్, ఒక బోర్డర్‌ చెక్‌పోస్టు కలిసి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ మూలధనాన్ని ఆవిరిచేశాయి. ఈ ఐదింటితో గత ఆర్థిక సంవత్సరం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రూ.1320 కోట్ల నష్టం వచ్చింది. సంస్థ నికర నష్టంలో ఈ ఐదింటి వాటా 70 శాతం.  

తిలా పాపం తలా పిడికెడు.. 
పద్ధతైన ఎన్‌బీఎఫ్‌సీగా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ఆర్‌బీఐ గతంలో కితాబులిచ్చింది. అలాంటి కంపెనీ ఇలా మారడం వెనుక కారణాలు చూస్తే... 
►దేదేశీ మౌలిక రంగాన్ని పీడిస్తున్న అధికారుల అలసత్వం, ప్రాజెక్టుల్లో జాప్యం, అవినీతి, రాజకీయ జోక్యాల అంతిమ ప్రభావం ఈ సంక్షోభం.  
►దే గ్రూప్‌లో ఆర్థిక ఇబ్బందులను ప్రధాన వాటాదారులు ముందు పసిగట్టలేకపోవడం సైతం సంక్షోభాన్ని తీవ్రం చేసింది. 
►దేరేటింగ్‌ ఏజన్సీలపైనా సందేహాలున్నాయి. ఒక్క డిఫాల్ట్‌కే ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ను భారీగా తగ్గించేయటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  
►దేపెద్ద నోట్ల రద్దు అనంతరం రియల్టీ పడకేయడంతో కంపెనీ ఆస్తుల విక్రయానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

ఆర్థిక సంస్థల లబోదిబో.. 
ఏ రంగానికి చెందిన కంపెనీలైనా డిఫాల్టయితే వాటికి అప్పులిచ్చిన ఆర్థిక సంస్థలపైనే తొలి ప్రభావం పడుతుంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్య దేశీయ బ్యాంకులకు క్రెడిట్‌ నెగటివ్‌ అని గ్లోబల్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ హెచ్చరించింది. ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదని, బ్యాంకులపై పడుతుందని మూడీస్‌ అభిప్రాయపడింది. ఇప్పటివరకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రోడ్డు ప్రాజెక్టులకిచ్చిన రుణాలను ఎన్‌పీఏలుగా గుర్తించలేదని తెలియజేసింది. మాతృసంస్థే డిఫాల్టయినందున బ్యాంకులకు నష్టాలు తప్పకపోవచ్చని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి ఇక ఏ కొంచెం అధ్వానంగా మారినా పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ వంటి ప్రభుత్వ బ్యాంకులు దారుణంగా దెబ్బతింటాయి. వీటి మొత్తం కార్పొరేట్‌ రుణాల్లో ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వాటా 0.5–1 శాతం శ్రేణిలో ఉంటుంది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాటాయే ఎక్కువ. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌లూ రుణాలిచ్చాయి.  

లేమన్‌ సంక్షోభంతో పోలికలేదు!! 
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌... ముద్దుగా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌. మాజీ బ్యాంకర్‌ పార్ధసారధి ఆలోచనలకు ప్రతిరూపం ఈ సంస్థ. హెచ్‌డీఎఫ్‌సీ, యూటీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తొలి వాటాదారులు కాగా.. ఆ తరవాత ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, ఓరిక్స్‌ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ వంటి దిగ్గజాలు వాటాలు కొన్నాయి. మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలిచ్చే ఈ సంస్థకు 256 దాకా అనుబంధ, భాగస్వామ్య సంస్థలున్నాయి. రుణాలివ్వటానికి కావాల్సిన నిధుల్ని టోకు ఇన్వెస్టర్ల నుంచి స్వల్పకాలిక బాండ్లు, రుణాల ద్వారా సమీకరిస్తోంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెప్టెంబర్లో కొన్ని రుణాలపై వడ్డీ చెల్లించటంలో డిఫాల్టయింది. లిక్విడిటీ సంక్షోభం తలెత్తింది. ఫలితం... బ్యాంకులు, ఎన్‌బీఎఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. దీంతో పలువురు ఈ సంక్షోభాన్ని పదేళ్ల కిందట అమెరికాలో తలెత్తిన లేమన్‌ బ్రదర్స్‌ సంక్షోభంతో పోలుస్తున్నారు. నిజానికి లేమన్‌ మాదిరిగానే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఆస్తులు కూడా లిక్విడిటీ లేని స్థిర, దీర్ఘకాలిక సెక్యూరిటీల రూపంలోనే ఉన్నాయి. రుణ నష్టాలకు అతి తక్కువ కేటాయింపులు చేయటం... ఓ పెద్ద బీమా సంస్థతో సహా పలు ఆర్థిక సంస్థలకు రుణాలివ్వటం... ఇవన్నీ లేమన్‌ తరహా చర్యలే. కాకపోతే నిపుణుల అంచనాల ప్రకారం...లేమన్‌తో పోలిస్తే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ చాలా చిన్నది. దీని ప్రభావం కూడా అంత తీవ్రమైనది కాదనే చెప్పాలి. ఇంకా వారేం చెబుతున్నారంటే... 2008 లేమన్‌ సంక్షోభంలో... ఆస్తుల విలువను భారీగా పెంచి చూపించటమనేది వ్యవస్థల్ని కుప్పకూల్చేసింది. రుణమిచ్చిన ఆస్తులకు సంబంధించి దాని వాస్తవ విలువకు ఎన్నో రెట్ల విలువలు ఖాతా పుస్తకాల్లో వచ్చి చేరాయి. ఆ విలువల ఆధారంగా రుణాలు మంజూరయ్యాయి. ఒక్కసారిగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ బలహీనపడటంతో వాటి వాస్తవ విలువలు మరింత తగ్గాయి. దీంతో వాటిపై రుణాలిచ్చిన సంస్థల ఆస్తుల విలువ కూడా ఒక్కసారిగా ఢమాల్‌మంది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి ఎలాంటి కేటాయింపులూ చేయకపోవటం... మినీ బాండ్లలో లేమన్‌ పెట్టుబడులే ఎక్కువ ఉండటంతో నాడు లేమన్‌ కుప్పకూలింది.  

మౌలికరంగ ప్రాజెక్టులే ఆస్తులు... 
కానీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ పరిస్థితి వేరు. ఇక్కడ క్రెడిట్‌ డెరివేటివ్స్‌ లేవు. పైపెచ్చు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఆస్తులు కాగితాలపై రాసిన పత్రాలు కాదు. స్థిరమైన మౌలిక రంగ ప్రాజెక్టులు. కొంత హెయిర్‌కట్‌ పోయినా... వీటి విలువలన్నీ వాస్తవిక అంచనాల ఆధారంగా వేసినవి. లేమన్‌ మాదిరి అంచనాల ఆధారంగా రూపొందించిన డెరివేటివ్‌ సాధనాలు కాదు కనుక... వీటిలో తేడా వచ్చినా అన్ని బ్యాంకులూ కుప్పకూలే పరిస్థితి లేదు. పైపెచ్చు దీనివల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టాన్ని తట్టుకోవటానికి క్రెడిట్, ఈక్విటీ పరమైన రక్షణాస్త్రాలున్నాయి. దీన్ని కొంచెం వివరంగా చూస్తే... ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ బ్యాలెన్స్‌ షీట్లో రూ.90,000 కోట్ల అప్పులున్నాయి. వీటిలో మ్యూచువల్‌ ఫండ్లు పెట్టింది రూ.4,000–5,000 కోట్లు కాగా... పెన్షన్‌ ఫండ్లు, బీమా కంపెనీలు రూ.10,000 కోట్ల వరకూ పెట్టాయి. మ్యూచువల్‌ ఫండ్లు పెట్టిన మొత్తమంతా పోయిందనుకున్నా... అవి షేర్లు కొనుగోలు చేసి పెట్టాయి కనుక నష్టపోయేది వాటి లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లే. మొత్తం వ్యవస్థంతా కుప్పకూలే పరిస్థితి ఉండ దు.  ఫండ్ల మొత్తం ఆస్తులతో పోలిస్తే ఈ పెట్టుబడి చాలా చాలా తక్కువ. ఇక 2018 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నికర విలువ రూ.7,400 కోట్లు. అంటే ఆస్తుల్లో హెయిర్‌కట్‌లకు మరికొంత దన్ను ఉందన్నట్టేగా!!. ఈ లెక్కన చూస్తే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రూ.90వేల కోట్లలో దాదాపు రూ.22–23వేల కోట్లకు భయం లేనట్టే. పైపెచ్చు ఎల్‌ఐసీ వంటి ప్రస్తుత షేర్‌హోల్డర్లు కావాలంటే మరింత వాటా తీసుకుని పెట్టుబడి పెడతామని చెబుతున్నారు.  ఈ లెక్కన చూస్తే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ వ్యవహారం వ్యవస్థను దెబ్బతీసేంత ప్రమాదకరమైంది కాదు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌లో మెజారిటీ వాటాలు ప్రయివేటు సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. కానీ అంతిమంగా ఇలాంటి దెబ్బలన్నీ భరించాల్సింది పన్ను చెల్లించే సామాన్యులే. ఎందుకంటే ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను ఆదుకోవటానికి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యత  ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ భుజాలపైనే పడింది. ఈ రెండూ ప్రభుత్వ రంగంలోనివే కనక అంతిమంగా పోయేది పన్ను చెల్లింపుదారుల సొమ్మే!!.

మందగమనానికి  దారితీస్తుందా? 
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ రుణాలు ఎన్‌పీఏలుగా మారితే బ్యాంకింగ్‌ రంగం మరింత ఇబ్బందుల్లోకి జారే ప్రమాదం ఉంది. సంక్షోభంతో ఇకపై ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల సమీకరణ సవాలుగా   మారనుంది. మరోపక్క రూపీ పతనాన్ని అడుకట్టకు ఆర్‌బీఐ మళ్లీ రేట్లు పెంచితే కార్పొరేట్లకు నిధుల కొరత ఏర్పడుతుంది. వ్యవస్థలో మందగమనానికి దారితీయొచ్చు. సమస్య నుంచి బయటపడేందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నిధుల సమీకరణ యత్నాలు ఆరంభించింది. వాటాల విక్రయం ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీలో అతిపెద్ద వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఈ పెట్టుబడి పెట్టొచ్చు. సెప్టెంబర్‌ 29న జరిగే ఏజీఎంలో ఈ రైట్స్‌ ఇష్యూపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top