
రాజకీయ పార్టీలు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాయి
రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ అవసరాల కోసం తనను ఫుట్‌బాల్‌లాగా ఆడుకుంటున్నాయని వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు.
వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ అవసరాల కోసం తనను ఫుట్‌బాల్‌లాగా ఆడుకుంటున్నాయని వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల నేతల ప్రసంగాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యా ఒక వార్తాచానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు పేర్కొన్నారు. ‘ఈ గొడవంతా కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యంతో మొదలైంది. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ వైఫల్యానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు నన్ను వ్యక్తిగతంగా బాధ్యుణ్ణి చేస్తున్నాయి. వాటి ఆరోపణలు తిప్పికొట్టేందుకు నా దగ్గర గట్టి సమాధానాలు కూడా ఉన్నాయి‘ అని మాల్యా చెప్పారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనపై సివిల్ కేసును క్రిమినల్ కేసు కింద మార్చిందని, బ్యాంకులను మోసగించడం.. మనీలాండరింగ్ అభియోగాలను దానికి అదనంగా చేర్చిందని ఆయన ఆరోపించారు. అసలు కేసు పెట్టతగ్గ నేరాలేమీ తాను చేయలేదని, వీటన్నింటినీ చట్టబద్ధంగా తాను ఎదుర్కొంటానని మాల్యా చెప్పారు. ‘కానీ భారతదేశం.. భారతదేశమే! రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు నేనో రాజకీయ ఫుట్‌బాల్‌లాగా కనిపిస్తున్నాను. వాటి ఎన్నికల ప్రచారాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఏది ఏమైనా నేను చట్టప్రకారం నడుచుకుంటాను‘ అని ఆయన పేర్కొన్నారు.