బ్యాలెన్స్‌ ఉన్నా సేవలు ఎలా ఆపేస్తారు..

How to stop the services.. - Sakshi

మినిమం రీచార్జ్‌ పేరుతో  కస్టమర్లను వేధించొద్దు 

టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశాలు

న్యూఢిల్లీ: టెలికం సర్వీసులను యథాప్రకారం పొందాలంటే ప్రతి నెలా తప్పనిసరిగా కనీస రీచార్జ్‌ చేసుకోవాలంటూ యూజర్లకు టెల్కోలు మెసేజీలు పంపిస్తుండటంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ స్పందించింది. తమ ప్రీ–పెయిడ్‌ అకౌంట్స్‌లో తగినంత బ్యాలెన్స్‌ ఉన్నా టెల్కోలు ఈ తరహా మెసేజీలు పంపిస్తున్నాయంటూ సబ్‌స్క్రయిబర్స్‌ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆపరేటర్లకు ట్రాయ్‌ అక్షింతలు వేసింది. అకౌంట్లో బ్యాలెన్స్‌ ఉన్నా సర్వీసులు డిస్కనెక్ట్‌ ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. తగినంత ప్రీ–పెయిడ్‌ బ్యాలెన్స్‌ ఉన్న కస్టమర్లకు సర్వీసులను తక్షణమే డిస్కనెక్ట్‌ చేయొద్దంటూ టెల్కోలను ఆదేశించింది. ‘టారిఫ్‌లు, ప్లాన్ల విషయంలో సాధారణంగా మేం జోక్యం చేసుకోము. కానీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్‌ ఉన్నా కూడా సర్వీసులు నిలిపివేస్తామంటూ యూజర్లను టెల్కోలు హెచ్చరిస్తుండటం.. మాత్రం సరికాదు’ అని ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ వ్యాఖ్యానించారు.
 

ఇందుకు సంబంధించి టెలికం సంస్థలకు మంగళవారమే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేటర్లతో గతవారమే భేటీ అయిన ట్రాయ్‌.. ఈ వివాదాన్ని సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈలోగా ‘ప్రస్తుత ప్లాన్‌ వేలిడిటీ ఏ రోజుతో ముగిసిపోతుందన్నది, మినిమం రీచార్జ్‌ ప్లాన్‌ సహా అందుబాటులో ఉన్న ప్లాన్స్‌ అన్నింటి గురించీ సబ్‌స్క్రయిబర్స్‌కు స్పష్టంగా, పారదర్శకంగా తెలియజేయాలి. ప్రీ–పెయిడ్‌ అకౌంట్లో బ్యాలెన్స్‌ ఉంటే దానితో సదరు ప్లాన్స్‌ ఎలా కొనుగోలు చేయొచ్చ న్నదీ వివరంగా తెలపాలి‘ అని టెల్కోలను ట్రాయ్‌ ఆదేశించింది. 72 గంటల్లోగా ఈ విషయాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా యూజర్లకు తెలియజేయాలని సూచించింది. అప్పటిదాకా కనీస రీచార్జ్‌ మొత్తానికి సరిసమానంగా అకౌంట్లో బ్యాలెన్స్‌ ఉన్న పక్షంలో సర్వీసులు డిస్కనెక్ట్‌ చేయరాదంటూ ఆదేశించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top