
రోబో సినిమాలో విలన్స్ వెపన్స్ అన్నింటినీ మ్యాగ్నెట్ మోడ్‌లో మారి చిట్టీ లాగేసుకున్నట్లు, ఇరాన్ లోని ఓ వ్యక్తి స్పూన్ మ్యాగ్నెట్ మనిషిగా మారాడు. పేరు అబోల్ఫజ్ సాబిర్ ముఖ్తారీ. కాని, అతని పేరు కన్నా అతను చేసిన పనే పవర్‌ఫుల్! అతను ఏం చేశాడంటే, తన శరీరంపై ఏకంగా 96 చెంచాలను అంటించుకొని గిన్నిస్ రికార్డు సాధించాడు.
అవును, తక్కువేం కాదు, అంటే రౌండ్ ఫిగర్‌కి ఇంకా నాలుగు మాత్రమే మిగిలిందంటే, అతని స్పూన్ ఫిక్షన్ లెవెల్ ఆ రేంజ్‌లో ఉంది మరి. 2021లో ముఖ్తారీ మొదటిసారి 85 చెంచాలతో రికార్డు చేశాడు. 2023లో ‘ఇదేం సరిపోదు’ అనుకున్నాడేమో 88 చెంచాలతో మళ్లీ తనదైన మార్క్ వేశాడు. ఇప్పుడేమో ‘ఇంకో స్పూన్ స్పెషల్స్ కలపాలి’ అని, నేరుగా 96 చెంచాలతో రికార్డే కాదు, నమ్మకాలకే చాలెంజ్ విసిరాడు.
‘చెంచాలు కూడా మనుషుల్ని ప్రేమించగలవా?’ అన్న ప్రశ్నకి ఔననే సమాధానాన్ని తన శరీరంతో చెప్పాడు!. ఇతని శరీరంపై చెంచాలు అతుక్కునే తీరు చూస్తే, చెంచాలకి మార్గం చూపించే గూగుల్ మ్యాప్‌లా ముఖ్తారీ కనిపిస్తాడు. ఈ విషయమై ముఖ్తారీ మాట్లాడుతూ, ‘నేను ఏ వస్తువునైనా నా శరీరానికి అతికించుకోగలను. ప్లాస్టిక్, గాజు, రాయి, చెక్క– ఇంకా ఎన్నో వస్తువులతో ప్రయోగాలు చేస్తున్నాను. త్వరలోనే మరో కొత్త రికార్డు చేస్తాను’ అని చెప్పాడు.