‘ఫెయిర్‌’ పోయి.. ‘గ్లో’ వచ్చింది..

Hindustan Unilever Changed His Fair And Lovely Brand Name - Sakshi

పేరు మార్చేసిన హిందుస్తాన్‌ యూనిలీవర్‌

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ఇకపై గ్లో అండ్‌ లవ్లీ

సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఆదరణ చూరగొన్న ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరును ‘గ్లో అండ్‌ లవ్లీ’గా మార్చినట్టు హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) గురువారం ప్రకటించింది. ఉత్పత్తి పేరు నుంచి ఫెయిర్‌ అన్న పదాన్ని తొలగించింది. అందానికి సంబంధించి సానుకూల దృక్పథాన్ని దృష్టిలో తీసుకుని నూతన పేరును నిర్ణయించినట్టు వివరించింది. వచ్చే కొన్ని నెలల్లో గ్లో అండ్‌ లవ్లీ పేరుతో ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని, భవిష్యత్తు ఆవిష్కరణలు సైతం ఈ దిశగానే ఉంటాయని పేర్కొంది.

పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్‌ హ్యాండ్‌సమ్‌గా పిలవనున్నట్టు హెచ్‌యూఎల్‌ తెలిపింది. అందానికి సంబంధించి సంపూర్ణ అర్థాన్నిచ్చే దృష్టితో ఫెయిర్‌ అండ్‌ లవ్లీ నుంచి ఫెయిర్‌ పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్‌యూఎల్‌ గత నెల 25న ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో హెచ్‌యూఎల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఎఫ్‌ఎంసీజీ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా,  ఫ్రెంచ్‌ కంపెనీ ఎల్‌ఓరియల్‌ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వైటెనింగ్‌ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది. 

ఆగ్రహించిన ఇమామీ! 
హెచ్‌యూఎల్‌ తాజా చర్యలపై పోటీ సంస్థ ఇమామీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త పేరు తమ ఉత్పత్తి పేరును పోలి ఉండడంతో న్యాయ నిపుణులను సంప్రదించనున్నట్టు ప్రకటన చేసింది. ‘‘షాక్‌కు గురైనప్పటికీ.. హెచ్‌యూఎల్‌ అనుచిత వ్యాపార విధానాల పట్ల ఆశ్చర్యమేమీ కలగలేదు. మా బ్రాండ్‌ ‘ఇమామీ గ్లో అండ్‌ హ్యాండ్‌సమ్‌’ను వారం క్రితమే డిజిటల్‌గా ఆవిష్కరించాం. ఇందుకు సంబంధించి అనుమతులకు దరఖాస్తు కూడా చేసుకున్నాం’’ అని ఇమామీ తెలిపింది. ఇమామీ పురుషుల సౌందర్య సాధనం పేరు ‘ఫెయిర్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌’గా ఇప్పటి వరకు మార్కెట్లో ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top