ముంబై–పుణె మధ్య హెలికాప్టర్‌ సేవలు

Helicopter services between Mumbai-Pune - Sakshi

వచ్చే మార్చి నుంచి ప్రారంభం 

తర్వాత షిర్డీకి సేవల విస్తరణ 

అమెరికాకు చెందిన ఫ్లైబ్లేడ్‌ శ్రీకారం  ఢిల్లీకి చెందిన హంచ్‌ వెంచర్స్‌తో జాయింట్‌ వెంచర్‌ 

సేవలు చౌకగా ఉండవన్న సంస్థ సీఈవో

ముంబై: యాప్‌తో నిమిషంలో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నట్టే... త్వరలో హెలికాప్టర్‌ సర్వీస్‌ను ఇంతే సులభంగా ఆర్డర్‌ చేసే అవకాశం రానుంది. దేశంలో తొలిసారిగా రెండు నగరాల మధ్య హెలికాప్టర్‌ సేవలు ఆరంభం కానున్నాయి. అమెరికాలో అతిపెద్ద హెలికాప్టర్‌ సేవల సంస్థ అయిన ‘ఫ్లై బ్లేడ్‌’ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీకి చెందిన హంచ్‌ వెంచర్స్‌ భాగస్వామ్యంతో కలసి ఈ సంస్థ ముంబై–పుణె నగరాల మధ్య హెలికాప్టర్‌ సర్వీసులను వచ్చే మార్చి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది మే వరకు ఎయిర్‌ఏషియాకు చీఫ్‌గా వ్యవహరించిన అమర్‌ అబ్రాల్‌ బ్లేడ్‌ ఇండియా సీఈవోగా పనిచేయనున్నారు. ఈక్విటీ పెట్టుబడుల సేవల్లో హంచ్‌ వెంచర్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాకు వెలుపల ఫ్లై బ్లేడ్‌ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్న తొలి దేశం భారత్‌ కావడం గమనార్హం.  

భారత మార్కెట్‌పై భారీ అంచనాలు 
ముంబైలోని జుహు, మహాలక్ష్మి ప్రాంతాల నుంచి హెలికాప్టర్‌ సర్వీసులు టేకాఫ్‌ తీసుకుంటాయి. తొలుత పుణె నగరంతో ఆరంభించి తర్వాత షిర్డీకి కూడా విస్తరించాలనుకుంటోంది ఫ్లైబ్లేడ్‌. తదుపరి ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా ఈ సేవలను విస్తరించే ఆలోచనతో ఉంది. వారాంతపు పర్యాటక సర్వీసులు కూడా సంస్థ ప్రణాళికల్లో ఉన్నాయి. బ్లేడ్‌ సీఈవో రాబ్‌ వీసెంతల్‌ మాట్లాడుతూ... ‘‘వాణిజ్య విమానాశ్రయాల్లో రద్దీ నుంచి హెలికాప్టర్‌ సేవలు ప్రయాణికులకు వెసులుబాటు కల్పిస్తాయి. 35 నిమిషాల ప్రయాణానికి 4–8 గంటల పాటు సమయం వెచ్చించాల్సిన అవస్థ తప్పుతుంది. అయితే, ఈ సేవలు ఓలా, ఊబర్‌ మాదిరిగా చౌకగా ఉండవు. డబ్బులు కంటే తమ సమయం విలువైన వారికి మా సేవలు తగినవి’’ అని వీసెంతల్‌ వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top