
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం... ద్రవ్యలోటు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటి ద్రవ్యలోటు పరిస్థితిపై తాజా గణాంకాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం– ఆర్థిక సంవత్సరం ఇంకా ఒకనెల మిగిలిఉండగానే ద్రవ్యలోటు బడ్జెట్ (2017–18) లక్ష్యాలను దాటి, ఏకంగా 120.3%కి చేరింది. విలువ రూపంలో ఇది రూ.7.15 లక్షల కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం రూ.5.94 లక్షల కోట్లుగా ఉండాలి.
ఆందోళన వద్దంటున్న ప్రభుత్వం
నిజానికి 2017–18 బడ్జెట్ ప్రకారం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 3.2 శాతంగానే ఉండాలి. అయితే 2018–19 బడ్జెట్‌లో దీనిని కేంద్రం 3.5 శాతానికి సవరించింది. ఈ సవరిత శాతంపైనే ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. కాగా ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉన్నట్లు బుధవారం ఫైనాన్స్ సెక్రటరీ హాస్‌ముఖ్ ఆదియా స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించినట్లూ వెల్లడించారు.
రూపాయి విలువపై ఎఫెక్ట్...
ద్రవ్యలోటు ఎఫెక్ట్ బుధవారం మనీ మార్కెట్‌పై పడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు నష్టపోయి 65.18కి చేరింది. వాణిజ్య యుద్ధ భయాలు, దేశ కరెంట్ అకౌంట్‌లోటు(క్యాడ్) ఆందోళనలు కూడా జతకావడంతో ఒక దశలో బుధవారం రూపాయి విలువ 65.30కి పడిపోవడం గమనార్హం.