సెన్సెక్స్‌ కీలకస్థాయి 31,990 పాయింట్లు

Fibonacci Sequence Affects the Stock Market - Sakshi

మార్కెట్‌ పంచాంగం

కరోనా వైరస్‌ ఉధృతి పలు దేశాల్లో తగ్గుముఖం పడుతున్నదన్న వార్తలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఈ వారం నుంచి దశలవారీగా తెరిచే ప్రణాళికను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో  ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ వరుసగా రెండోవారం లాభపడ్డాయి. అయితే మార్చినెలలో నమోదైన కనిష్టస్థాయిల నుంచి ఇప్పటివరకూ వివిధ దేశాలు సాధించిన ర్యాలీల్లో ఇండియా, బ్రెజిల్‌లు బాగా  వెనుకపడివున్నాయి. అమెరికా సూచీలు వాటి మొత్తం నష్టాల్లో 50 శాతం రికవరీ చేసుకోగా, యూరప్‌ మార్కెట్లన్నీ కీలకమైన 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయిల్ని దాటాయి. కానీ ఇండియా  మార్కెట్‌ మాత్రం మొత్తం నష్టాల్లో 35 శాతం మాత్రమే పూడ్చుకోగలిగింది.  భారత్‌ సూచీల రికవరీ తక్కువగా వుండటానికి అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్‌ షేర్లే ప్రధాన కారణం. బ్యాంక్‌ నిఫ్టీ రికవరీ 28  శాతంగా ఉంది. వచ్చే కొద్దివారాల్లో బ్యాంకింగ్‌ షేర్లు కోలుకోవడం లేదా కొత్త లీడర్లు ఆవిర్భవిస్తేనే మార్కెట్‌ గణనీయంగా పుంజుకునే అవకాశం వుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఏప్రిల్‌ 17తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్‌వారంలో 4 శాతం హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 429 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్ద  ముగిసింది. లాభాలతో ముగియడం ఇది వరుసగా రెండోవారం. ఈ క్రమంలో సూచి మధ్యకాలిక ట్రెండ్‌ను నిర్దేశించే  అతిముఖ్యమైన స్థాయిని సమీపిస్తున్నది.  సెన్సెక్స్‌ జనవరిలో సాధించిన 42,273  పాయింట్ల నుంచి మార్చిలో నమోదుచేసిన 25,639 పాయింట్ల వరకూ జరిగిన పతనానికి 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 31,990 పాయింట్లు సెన్సెక్స్‌ కీలకస్థాయి. ఈ వారం  అప్‌ట్రెండ్‌ కొనసాగితే తొలి అవరోధం ఈ స్థాయి వద్ద ఎదురవుతున్నది.  ఈ స్థాయిపైన స్థిరపడితే 32,490 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై క్రమేపీ 33,100 పాయింట్ల వరకూ ర్యాలీ  కొనసాగవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి అవరోధస్థాయిని దాటలేకపోతే 30,960–30,800 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే  30,020 పాయింట్ల వరకూ  తగ్గవచ్చు. ఈ లోపున  29,520 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.

నిఫ్టీ ప్రధానస్థాయి 9,390...
క్రితంవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో  9,267 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి– మార్చి నెలల మధ్య 12,430 పాయింట్ల నుంచి 7,511 పాయింట్ల వరకూ జరిగిన  పతనంలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన  9,390 పాయింట్ల స్థాయి ఈ వారం నిఫ్టీకి కీలకం. ఈ స్థాయిపైన స్థిరపడితే 9,500  పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ  9,610 పాయింట్ల వరకూ పెరగవచ్చు.  ఈ వారం 9,390 పాయింట్ల స్థాయిని అధిగమించలేకపోతే 9,090–9,050  పాయింట్ల శ్రేణి వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 8,820  పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ లోపున 8,670 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు.

– పి. సత్యప్రసాద్‌ 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top