ఫేస్‌బుక్‌కు షాక్‌ : యూకే భారీ జరిమానా

Facebook Faces UK Fine Of Around $6,60,000 After Data Scandal Found To Be Illegal - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాండల్‌తో సతమతమవుతోంది. ఇప్పటికే ఈ స్కాండల్‌ విషయంలో అమెరికా చట్టసభ్యుల ముందు తలవంచిన ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌.. ఈసారి యూకేలో భారీ జరిమానాను ఎదుర్కోబోతున్నారు. తాజాగా బ్రిటన్‌ డేటా రెగ్యులేటరీ ఫేస్‌బుక్‌పై చర్యలు ప్రారంభించింది. యూజర్ల అనుమతి లేకుండా కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు డేటా షేర్‌ చేసి.. తమ చట్టాలను బ్రేక్‌ చేసినందుకు గాను 6,62,900 డాలర్ల జరిమానా అంటే సుమారు నాలుగున్నర కోట్ల జరిమానాను విధించింది. యూకే డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను రెండు విధాలుగా బ్రేక్‌ చేసినందుకు తాము విధించిన ఈ గరిష్ట జరిమానాను చెల్లించాలని ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్స్‌ ఆఫీసు(ఐసీఓ) ఆదేశించింది. ప్రజల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో ఫేస్‌బుక్‌ విఫలమైందని ఐఓసీ పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8.7 కోట్ల ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత డేటాను పొలిటికల్‌ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా అక్రమంగా పొందిందని మార్చిలో బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఫేస్‌బుక్‌ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ డేటా స్కాండల్‌తో, ఫేస్‌బుక్‌ డేటా సెక్యురిటీ విధానాలపై యూకే ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ ఆఫీసు కూడా విచారణ చేపట్టింది. ఫేస్‌బుక్‌లో యూజర్ల డేటాకు భద్రత ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేపట్టింది. అదేవిధంగా సమాచారాన్ని దుర్వినియోగ పరుస్తూ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఎవైనా ప్రచారాలు జరిగాయా? అనే విషయంపై కూడా విచారణ జరిపింది. అందులో ఫేస్‌బుక్ విఫలమవడంతో సంస్థపై జరిమానాను విధించేందుకు సిద్ధమైంది. డేటా ప్రొటెక్షన్‌ చట్టం కింద గరిష్ఠ జరిమానా విధించాలని తాము భావించినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. అంతేకాక వందల కొద్దీ టెర్రాబైట్స్‌ డేటా కలిగి ఉన్న సర్వర్లను, ఇతర పరికరాలను సీజ్‌ చేశారు. దీనిపై రిపోర్టును కూడా ఐఓసీ విడుదల చేయనున్నట్టు తెలిసింది. 

తమ ప్రజాస్వామ్య విధానంలోని చిత్తశుద్ధిపై నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయని, ఎందుకంటే సగటు ఓటర్లు, వెనుకాల ఏం జరుగుతుందనే విషయంపై తక్కువ అవగాహన కలిగి ఉంటారని ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ ఎలిజబెత్‌ డెన్హామ్‌ చెప్పారు. చెడు ఉద్దేశ్యం కోసం ఈ విధంగా వ్యవహరించిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, కానీ తమ ప్రజాస్వామ్య విధానంపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.  ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించడంతో పాటు 11 రాజకీయ పార్టీలకు హెచ్చరికల లేఖలు, ఆడిట్‌ నోటీసులను ఐఓసీ పంపింది. కాగ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తరఫున పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఫేస్‌బుక్‌ చిక్కుల్లో పడింది. ఈ వ్యవహారంపై కంపెనీ స్పందించి.. పొరబాటు తమదేనని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. అయితే ఈ కుంభకోణం విషయంలో ఇప్పటికే పలుమార్లు ఫేస్‌బుక్‌ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఆఫీస్‌ కూడా ఫేస్‌బుక్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టింది. యూరోపియన్‌ యూనియన్‌లో యూకే సభ్యత్వంపై 2016లో జరిగిన రెఫరెండం సమయంలో రాజకీయ ప్రచారాల్లో ఏమైనా వ్యక్తిగత డేటా దుర్వినియోగమైందా? అనే విషయంపై విచారణ జరిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top