ఆ ఉద్యోగులు రూ. 90 లక్షలు పొందనున్నారా ?

Employees To Get Big Retirement Package Highest Payout At Rs 90 Lakh In BSNL - Sakshi

న్యూఢిల్లీ : బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద 50 సంవత్సరాలు పైబడిన కొంత మంది ఉద్యోగులు రూ. 90 లక్షలు ప్యాకేజీ పొందే అవకాశం ఉంది. దీంతో 50 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల చేపట్టిన స్వచ్ఛంద పదవి విరమణ పథకం ప్రకారం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగులు పదవి విరమణను ఎంచుకోవడానికి అర్హులుగా ప్రకటించింది. దీంతో బీఎస్‌ఎన్‌లో పని చేస్తున్న 1.6 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం 63శాతం అంటే లక్ష మంది వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రెండు వారాల్లోనే ఈ పథకానికి దాదాపు 80వేల మంది ఎన్‌రోల్‌ చేసుకున్నారు. డిసెంబరు 3వ తేదీ వరకు అవకాశం ఉండడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే బీఎస్ఎన్‌లో ఉద్యోగులకు ప్రస్తుత పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కాగా, 55 ఏళ్లు నిండిన వారికి వీఆర్‌ఎస్‌ పథకం కింద మిగిలిన ఐదేళ్ల కాలానికి జీతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రసుత్తం వీఆర్‌ఎస్‌ పొందే ఉద్యోగులు జీతంతో పాటు అదనంగా పొందనున్న పదవీ విరమణ ప్యాకేజీతో లక్షాధికారులుగానే రిటైర్‌ అవ్వనున్నట్లు తేలింది. ఎందుకంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ నెలవారీ జీతం బడ్జెట్ సుమారు రూ .1,200 కోట్లు ఉండగా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వ్యక్తులు నెలకు కనీసం 75,000 రూపాయల జీతం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ పథకాన్ని ఎంచుకున్న 50 సంవత్సరాల వయస్సులో ఉన్న కొంతమంది ఉద్యోగులు రూ .90 లక్షల విరమణ ప్యాకేజీని పొందే అవకాశం ఉంది.

ఉదాహరణకు ఒక 50 ఏళ్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి  సుమారు 75,000 రూపాయలు సంపాదిస్తున్నారని అనుకున్నా, వీఆర్‌ఎస్‌ తీసుకుంటే ఇంకా 10 సంవత్సరాల సేవ మిగిలి ఉంటుంది. దీంతో సదరు ఉద్యోగికి ఆ మొత్తం కాలానికి వేతనంతో పాటు ప్యాకేజీ లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, 59 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగి వీఆర్‌ఎస్‌ను ఎంచుకుంటే సుమారు రూ.9 లక్షల రూపాయలు పొందుతారు. అయితే పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల జీతానికి రక్షణ ఉంటుందని, కేబినెట్ నిర్ణయం ప్రకారం వారికి పూర్తి జీతం లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top