
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19 ఏప్రిల్–మార్చి) 7.5 శాతం వృద్ధి నమోదుచేస్తుందని అంచనా వేస్తున్నట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. అయితే డాలర్ మారకంలో రూపాయి బలహీనత, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ, పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ఆందోళనకరమైన అంశాలని పేర్కొంది. 2016–17లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం. 2017–18 ఆర్థిక సంవత్సరం వృద్ధి గణాంకాలు ఈ నెల 31న విడుదలవుతాయి. 7.4 శాతంగా ఈ గణాంకాలు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఇక్రా అంచనావేశాయి. తాజాగా విడుదలైన కేర్ రేటింగ్స్ నివేదిక చూస్తే...
►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశాభివృద్ధికి పరిశ్రమలు, వ్యవసాయ రంగాలు, పెట్టుబడులు, వ్యయాల పెరుగుదల కీలకం కానున్నాయి.
►అయితే ద్రవ్యోల్బణం, రుణ రేటు పెరిగే అవకాశాలు, ద్రవ్యలోటు సవాళ్లు, కరెంట్ అకౌంట్ లోటు సమస్యలు, మారకపు విలువ బలహీనత ఆందోళన కలిగించే అంశాలు.
►వార్షిక సగటు చూస్తే, ముడిచమురు బ్యారెల్ ధర 80 డాలర్లు దాటకపోవచ్చు. సగటు ధర 75 డాలర్లుగా నమోదయ్యే వీలుంది.
►ఇక రూపాయి కూడా 68 స్థాయిలో కొనసాగే వీలుంది.
►విదేశీ మారకద్రవ్య నిల్వలు 425 – 435 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండవచ్చు.
►2017–18 మొదటి తొమ్మిది నెలల్లో జీడీపీతో పోల్చిచూస్తే– కరెంట్ అకౌంట్ లోటు 1.7 శాతం. అయితే 2018–19 మొత్తంగా ఇది 2.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
►వ్యవసాయ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4 శాతంగా నమోదయ్యే వీలుంది. పారిశ్రామిక ఉత్పత్తి 6 శాతంగా నమోదుకావచ్చు. 2016–17లో ఈ రేట్లు వరుసగా 3%, 4.3 శాతం.
►వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2017–18లో 3.6 శాతం ఉంటే ఇది 2018–19లో 5.5 శాతానికి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రెపో ప్రస్తుత 6 శాతం నుంచి మరో అరశాతం పెరిగే అవకాశం ఉంది.
►బ్యాంకులకు మొండిబకాయిలు పెద్ద సవాలే. అయితే రుణ వృద్ధి 12 శాతం, డిపాజిట్ల వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుంది.
►ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 2018–19లో 3.3 శాతంగా ఉంచాలన్న ప్రభుత్వ లక్ష్యం సవాలే. ఇది రూ. 80,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం. జీఎస్‌టీ ఇతర పన్ను వసూళ్లుపై ఆధారపడి ఉంటుంది.