వ్యాపారాలనూ వదలని అవినీతి | Businesses encompass corruption | Sakshi
Sakshi News home page

వ్యాపారాలనూ వదలని అవినీతి

Nov 2 2018 12:48 AM | Updated on Nov 2 2018 12:48 AM

Businesses encompass corruption - Sakshi

న్యూఢిల్లీ: లంచాలు, అక్రమార్జన అనేవి భారత్‌ సహా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నిర్వహించిన సర్వేలో తేలిసింది. వ్యాపారాల్లో అవినీతి, లంచాలు తారస్థాయిలో ఉన్నాయని ఈవై సర్వేలో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మన దేశంలోనూ 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో 40 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపారాల్లో అవినీతి అక్రమార్జన విధానాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. 12 శాతం మంది గత రెండేళ్లలో తమ కంపెనీ పెద్ద ఎత్తున మోసాలను చవిచూసినట్టు చెప్పారు. 20 శాతం మంది నగదు చెల్లింపులు అన్నవి వ్యాపారం నిలదొక్కుకునేందుకు అవసరమన్నారు’’ అని ఈవై నివేదిక తెలియజేసింది.  

భారత్‌లో కార్పొరేట్‌ పరిపాలన, పారదర్శకతను పెంపొందించేందుకు... అవినీతి నిరోధక చట్టం 2018, కంపెనీల చట్టం 2017, ఐబీసీ, నిబంధనలు పాటించకపోతే జరిమానాల వంటి పలు ప్రయ త్నాలు జరిగినట్టు ఈవై తెలిపింది. ‘‘అయినప్పటికీ మోసం, అవినీతి అనేవి వృద్ధికి ప్రధాన అడ్డంకులు. మీడియాలో తరచుగా అవినీతికి సంబంధించి పెద్ద కేసులను చూపించడం వల్ల సంబంధిత ప్రాంతంలో వ్యాపారాలను నిర్వహించే కంపెనీల ప్రతిష్టకు రిస్క్‌ ఉంటుంది’’ అని ఈవై అభిప్రాయం వ్యక్తం చేసింది. చాలా వర్ధమాన దేశాల్లో కొత్త చట్టాల అమలు, నిఘాను పెంచడం, మోసాల నివారణకు కంపెనీల స్వీయ కార్యాచరణ వంటివి చేపట్టినాగానీ సెంటిమెంట్‌ బలహీనంగానే ఉందని ఈవై తెలిపింది. అక్రమాలను ముందే గుర్తించి నిరోధించేందుకు ఫోరెన్సిక్‌ డేటా అనలిటిక్స్‌ వినియోగం వంటి చర్యలు అవసరమని సూచించింది. ఈవై ఫోరెన్సిక్‌ అండ్‌ ఇంటెగ్రిటీ సర్వీసెస్‌ ఈ సర్వేను నిర్వహించింది. భారత్‌తోపాటు జపాన్, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ సహా 33 వర్ధమాన మార్కెట్లకు సంబంధించి 1,450 ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను సేకరించింది.  

ఆసక్తికర అంశాలు 
►వ్యాపారానికి మోసాలు, అవినీతి అతిపెద్ద ముప్పు అని 42% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 29 శాతమే.  
►కంపెనీ మనుగడ సాగించాలంటే కొంత మేర ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పని పరిస్థితిగా చాలా సంస్థలు చెప్పడం గమనార్హం.  
► కాంట్రాక్టుల కోసం లంచాలు సాధారణమేనని 16% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 5 శాతం మంది ఉన్నారు. 
► వ్యాపార ప్రయోజనాల కోసం నగదు రూపేణా ప్రోత్సాహకం ఇవ్వడం ఆమోదనీయమేనని వర్ధమాన మార్కెట్లలో 19% మంది చెప్పారు. దీన్ని సమర్థించే విషయంలో 33 వర్ధమాన దేశాల్లో భారత్‌ 12, చైనా 6వ స్థానంలో ఉన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement