పారదర్శకత లోపించిన పాలసీ

Covid-19 Lack Of Transparency In India - Sakshi

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేత ప్రక్రియ వేగం పుంజుకుంది. కానీ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకునే సమయం కాదిది. ఇంతవరకు వైరస్‌ కట్టడివైపుగా సాగిన ప్రయాణాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడానికి ప్రస్తుత వెసులుబాటును మంచి అవకాశంగా తీసుకోవాలి. భారత్‌లో కరోనా వైరస్‌పై ప్రభుత్వ స్పందనను పద్ధతి ప్రకారం ప్రజలు సమీక్షించిన అనుభవం మనకు ఇంతవరకు లేదు. పౌరుల ప్రాణాలను ప్రభావితం చేస్తున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పార్లమెంటరీ సభా కమిటీలు అంచనా వేసి ప్రభుత్వాన్ని, విధాన నిర్ణేతలను నిలదీసినప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్, వైరస్‌ సంబంధిత విధానాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.

కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో రోజువారీ కొత్త కేసులు 37 వేలకు పడిపోయాయి. మే నెలలో సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్నప్పుడు దీనికి పది రెట్లకు మించిన కేసులు నమోదయ్యాయి. అనేక నగరాల్లో కరోనా అదుపు తప్పిపోవడం కూడా చూశాం. సవరించిన విధానం ప్రకారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేత ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణ మొదలైపోయింది.

ఇంతవరకు భారత్‌లో మహమ్మారి పట్ల ప్రభుత్వ స్పందనను నిశితంగా అంచనావేయడానికి, మరింత ముందుకు సాగిపోవడానికి ఇదే తగిన సమయం. ఇప్పటికీ వైరస్‌ వ్యాపిస్తూనే ఉంది. భవిష్యత్తులోనూ ఇది మరింతగా వ్యాపించే అవకాశాన్ని తోసిపారేయలేం. వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకునే సమయం కాదిది. ఇంతవరకు వైరస్‌ కట్టడివైపుగా సాగిన ప్రయాణాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడానికి ప్రస్తుత వెసులుబాటును మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలి. విలువైన గుణపాఠాలు తీసుకుని ఇకముందు ఎలా ముందుకెళ్లాలో కార్యాచరణను రూపొందించుకోవడానికి ఇలాంటి సమీక్ష దోహదం చేస్తుంది.

మహమ్మారికి సంబంధించి రెండు వేవ్‌లను మనం అధిగమించాం. ఫస్ట్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం, రాబోతున్న వైరస్‌ దూకుడుకు తట్టుకునే విధంగా ఆరోగ్య వ్యవస్థను మలుచుకునే చర్యలు చేపట్టిన కారణంగా వైరస్‌పై ప్రభుత్వ స్పందన పటిష్టంగా కనిపించింది. ఫస్ట్‌ వేవ్‌ దశలోనే వ్యాక్సిన్‌ అభివృద్ధి, తయారీకి చర్యలను ప్రారంభించారు. 2021 ప్రారంభానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాక్సిన్‌ పంపిణీ నిదానంగా సాగింది. ఈలోపు సెకండ్‌ వేవ్‌ దేశాన్ని చుట్టుముట్టింది. ఇది మన ఆరోగ్యవ్యవస్థలోని లోటుపాట్లను, మన సన్నాహాల్లోని డొల్లతనాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. మొదట్లోనే వ్యూహాత్మకంగా వ్యాక్సిన్‌ ప్రక్రియను చేపట్టడం, రాజకీయ, మతపర సమావేశాలను నిరోధించడం, జన్యుపరమైన నిఘాను సమర్థంగా నిర్వహించడం వంటివి సెకండ్‌ వేవ్‌ కాలంలో సంభవించిన తీవ్ర విషాదాన్ని తగ్గించగలిగేవి.

గత కొద్ది వారాలుగా, కొన్ని నెలలుగా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రభుత్వం స్పందించిన తీరును ప్రజానీకం తనిఖీ చేయవలసిన అవసరం వుంది. జాతీయ స్రవంతి మీడియాలో, సోషల్‌ మీడియాలో సెకండ్‌ వేవ్‌ కట్టడిలో ఎక్కడ తప్పు జరిగింది అనే అంశంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మోతాదుకు మించి చోటు చేసుకున్నాయి కానీ భారత్‌లో కరోనా వైరస్‌పై ప్రభుత్వ స్పందనను పద్ధతి ప్రకారం ప్రజలు సమీక్షించిన అనుభవం మనకు ఇంతవరకు లేదు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజల అభిప్రాయం ఏమిటనే చర్చకు తావిచ్చిన దాఖలాలు కనపడటం లేదు. జైరాం రమేష్‌ నేతృత్వంలో శాస్త్ర సాంకేతిక వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ కమిటీ వ్యాక్సిన్లపై, జీనోమ్‌ విశ్లేషణపై ఇటీవలే చర్చను ప్రారంభించింది కానీ అధికార పక్షంలోని సభ్యులు దీన్ని వ్యతిరేకించారు.

భారత్‌లో మహమ్మారి సంబంధిత విధాన స్పందన చాలా అస్పష్టంగా ఉంటూ వచ్చింది. కీలకమైన విధానాలు నిరంకుశ ధోరణితో ఉన్నట్లు కనిపించాయి. ప్రభుత్వం చేసిన ప్రకటనలకు భిన్నంగా ఆధారాల సాక్షిగా స్పష్టమైన విధానం కొనసాగినట్లు కనిపించలేదు. ఉదాహరణకు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన తర్వాతే వ్యాక్సిన్‌ సేకరణపై ప్రభుత్వ విధానం వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌ పాలసీపై ప్రభుత్వ విధానం నిరంకుశత్వంతో ఉందనే తీవ్ర పదజాలాన్ని కూడా న్యాయస్థానం ఉపయోగించాల్సి వచ్చింది. న్యాయస్థానంలోనూ, సమాజంలోనూ తీవ్ర విమర్శ రావడంతో 2021 డిసెంబర్‌ 31 నాటికి దేశంలోని వయోజనులందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో భారత్‌ 216 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను సేకరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్‌ ప్రకటించారు.

అయితే, ఈ వారం కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన రెండో అఫిడవిట్‌లో అంతకుముందు ప్రకటించిన 216 కోట్ల డోస్‌లకు బదులుగా 186 కోట్ల డోస్‌లను మాత్రమే సేకరించగలమని పేర్కొంది. దేశంలో 18 సంవత్సరాలకు పైబడిన భారతీయులందరికీ ఇవి సరిపోతాయని కేంద్రం పేర్కొంది. దీంట్లో భాగంగా జూలై 31 నాటికి 51 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని, డిసెంబర్‌ 31 నాటికి మిగిలిన 135 కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. వీటిలో 50 కోట్ల డోస్‌లు కోవిషీల్డ్, 40 కోట్లు కోవాగ్జిన్, 10 కోట్ల డోసులు స్పుత్నిక్‌ వి కి సంబంధించి ఉంటాయని, మిగిలిన 35 కోట్ల డోసుల కోసం ఇప్పటికి వృద్ధి దశలోనే ఉంటున్న  బయోలాజికల్‌ ఇ, జైడస్‌ కాడ్లియా వ్యాక్సిన్లపై ఆధారపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలోనూ పరస్పర విరుద్ధమైన లెక్కలు ముందుకొచ్చాయి. 2021 మే నెలలో కేంద్రప్రభుత్వం అదే న్యాయస్థానానికి ఇచ్చిన సమాచారం ప్రకారం జూలై నెల నాటికి 6.5 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేయగలమని తెలిపింది. కానీ జూన్‌ నెలలో దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి సామర్థ్యం 50 కోట్లకు చేరుకుంటుందని అతిశయించి చెప్పింది. అదేవిధంగా ఈ రెండు అఫిడవిట్‌లు దాఖలు చేసిన మధ్య కాలంలో 33 కోట్ల నుంచి 40 కోట్ల మేరకు కోవిషీల్డ్‌ డోసులను పెంచి చూపించడం గమనించాలి.

ఈ జూన్‌ చివరినాటికి దేశంలో పూర్తిగా వ్యాక్సినేషన్‌ వేయించుకున్న భారతీయుల సంఖ్య జనాభాలో 4 శాతానికి పైబడి ఉంది. ఈ లెక్కన చూస్తే ఈ సంవత్సరం చివరినాటికి 100 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కోర్టు ముందు ప్రకటించిన ప్రకారం అన్ని కంపెనీల వ్యాక్సిన్‌ డోసులను కలిపినా ఈ స్థాయికి చేరుకోవడం అసాధ్యం. వచ్చే కొన్ని నెలల్లో వ్యాక్సిన్ల లభ్యత పుంజుకుంటుంది కానీ రెండు డోసుల మధ్య అంతరం బాగా పెరుగుతుంది. 2021 చివరి త్రైమాసికంలో కోవిషీల్డ్‌ వేయించుకున్న ప్రజలు రెండో డోసును 2022 తొలి త్రైమాసికంలో మాత్రమే పొందగలరు. దీంతోపాటుగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పరీక్షలు, సేకరణ, ధరల నిర్ణయం, అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడంపై చాలా అనుమానాలు కూడా బయలుదేరుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్‌లలో ఆరోగ్య అధికారులు, శాస్త్ర సాంకేతిక సలహాదార్లు, వ్యాక్సిన్‌ కంపెనీలతో ముడిపడి ఉన్న సభా సంఘాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాయి. బ్రిటన్‌లో ప్రతినిధుల సభకు చెందిన కోవిడ్‌ 19 కమిటీ ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి కలిగించే సుదీర్ఘ ప్రభావాలను అంచనా వేస్తోంది. ఇక అమెరికాలో కరోనా వైరస్‌ సంక్షోభంపై నియమించిన సెలెక్ట్‌ కమిటీ పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ రాప్‌ స్పీడ్‌ పథకంలోని వైఫల్యాలపై దర్యాప్తు చేస్తోంది. పైగా ఉపశమనం కోసం కేటాయించిన నిధుల విషయంలో జరిగిన మోసం, దుర్వినియోగంపై ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇక యూరోపియన్‌ పార్లమెంటుకి చెందిన పర్యావరణ సభ్యులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత కమిటీ యూరప్‌ ఖండంలో వ్యాక్సిన్‌ సమస్యలను అధ్యయనం చేస్తున్నాయి. భారతదేశంలో పార్లమెంటరీ ప్యానెళ్లు నకిలీ వార్తల ప్రచారం, తదితర అంశాలపై సోషల్‌ మీడియా కంపెనీలను ప్రశ్నించవచ్చు. పౌరుల ప్రాణాలను ప్రభావితం చేస్తున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఇవి సమర్థంగా అంచనా వేయవచ్చు. ఇలాంటి అభ్యాసాలు ప్రభుత్వాన్ని, విధాన నిర్ణేతలను తమ తమ చర్యలకు నేరుగా జవాబుదారీని చేసి నిలదీయవచ్చు. అలా మాత్రమే వ్యాక్సినేషన్, వైరస్‌ సంబంధిత విధానాలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది.


వ్యాసకర్త సైన్స్‌ వ్యాఖ్యాత
(ట్రిబ్యూన్‌ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top