
అంతరిక్ష రంగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త అధ్యాయం లిఖించుకుంది

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థల్లోకి తన వ్యోమగామి శుభాంశు శుక్లాను పంపించిన ప్రయోగం విజయవంతమైంది

భారత్ తరఫున ఐఎస్‌ఎస్‌లోకి అడుగుపెట్టి.. సురక్షింగా భూమ్మీదకు తిరిగొచ్చిన ఘనత శుక్లా సొంతమైంది. అలాగే 41 ఏళ్లకు రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యక్తి కూడా శుక్లానే.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది.

28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ప్రసిద్ధ కుపోలా విండో వద్ద నుంచి భూమిని వీక్షిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు.

శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌లో పరిశోధనలతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, విద్యార్థులతో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత ప్రధాని మోదీతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ‘‘అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎలాంటి సరిహద్దులు కనిపించవు, అందులో భారతదేశం ఎంతో విశాలంగా కనిపిస్తుంది’’ అని చెప్పారు. అలాగే.. జూలై 3, 4 తేదీల్లో తిరువనంతపురం, బెంగళూరు, లక్నోలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.

అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో.. యాక్సియం-4 మిషన్‌ను ఇస్రో, నాసాతో పాటు ఈఎస్‌ఏ, స్పేస్‌ఎక్స్ భాగస్వామ్యంతో నిర్వహించారు.

భారత ప్రభుత్వం ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం బడ్జెట్‌లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు.. గగన్‌యాన్ మిషన్‌కు ముందడుగుగా పరిగణించబడుతోంది.

18 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన శుక్లా బృందం.. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నాం భూమ్మీదకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా సురక్షితంగా తిరిగొచ్చింది. దీంతో ఇస్రో వర్గాలు సంబురాల్లో మునిగితేలుతున్నాయి.