టెలికం కంపెనీల ‘షేరింగ్’ రూట్ | BSNL, Jio ink intra-circle roaming agreement | Sakshi
Sakshi News home page

టెలికం కంపెనీల ‘షేరింగ్’ రూట్

Sep 13 2016 6:37 AM | Updated on Sep 4 2017 1:13 PM

టెలికం కంపెనీల ‘షేరింగ్’ రూట్

టెలికం కంపెనీల ‘షేరింగ్’ రూట్

టెలికం కంపెనీలు అదనపు వ్యయ భారం లేకుండా ఇచ్చి పుచ్చుకునే విధానంలో కవరేజీ సేవలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి.

నెట్‌వర్క్ షేరింగ్ కోసం ఒప్పందాలు
బీఎస్‌ఎన్‌ఎల్‌తో జియో టై అప్
ఇప్పటికే వొడాఫోన్‌తోనూ
బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఒప్పందం

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు అదనపు వ్యయ భారం లేకుండా ఇచ్చి పుచ్చుకునే విధానంలో కవరేజీ సేవలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నెట్‌వర్క్ షేరింగ్ కోసం చేతులు కలుపుతున్నాయి. వొడాఫోన్, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో టై అప్ అయిన మరుసటి రోజే రిలయన్స్ జియో సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం చేసుకుంది. 2జీ, 4జీ సేవలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఒప్పందాన్ని జియో, బీఎస్‌ఎన్‌ఎల్ కుదుర్చుకున్నట్టు సోమవారం ఇక్కడ ప్రకటించాయి. దీంతో ఇరు కంపెనీల కస్టమర్లకు మరింత విస్తృత కవరేజీ అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియో సేవలు బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు అందుబాటులోకి రానుండగా... జియో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ పరిధిలో వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలవుతుంది.

 ‘సేవల విస్తరణ, నెట్‌వర్క్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా మా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంపై దృష్టి పెట్టాం. ఈ ఒప్పందం వల్ల రెండు కంపెనీల వినియోగదారులకు మేలు కలుగుతుంది. నిరంతరాయ సేవలు అందించడానికి వీలవుతుంది. మా నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఇందుకు మూడు నెలలు పడుతుంది. తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు 4జీ హ్యాండ్‌సెట్‌తో జియో సేవలు అందుకోవచ్చు. ధరలను త్వరలోనే ఖరారు చేస్తాం’ అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ చెప్పారు. ‘తాజా డీల్‌తో జియో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పై 2జీ వాయిస్ కాల్స్ చేసుకోవడంతో పాటు రోమింగ్‌లో కవరేజీకి ఉపకరిస్తుంది’ అని జియో ఎండీ సంజయ్ మష్రువాలా పేర్కొన్నారు.

 జియోకు మరిన్ని పోర్ట్‌లు: ఐడియా
రిలయన్స్ జియో నెట్‌వర్క్ కోసం మరిన్ని పోర్ట్‌లను అందుబాటులోకి తెస్తామని ఐడియా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 18.5 లక్షల కస్టమర్ల కాల్స్ ట్రాఫిక్‌ను సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. అయితే, జియో నెట్‌వర్క్ నుంచి భారీ సంఖ్యలో వచ్చే కాల్స్‌తో తమకు నష్టం వాటిల్లనున్నట్టు తెలిపింది. ఇంటర్‌కనెక్ట్‌పై ట్రాయ్‌తో ఇటీవల టెల్కోల భేటీ తర్వాత ఐడియా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement