
న్యూఢిల్లీ: అతి తక్కువగా కేవలం 2 శాతం వేతన బిల్లు వ్యయాన్ని పెంచుతామంటూ మేనేజ్‌మెంట్ – ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. ఇందుకు నిరసనగా మే 30, 31 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె జరుపుతారని హెచ్చరించాయి.
ధరల పెరుగుదల తీవ్రంగా ఉంటున్నప్పుడు స్వల్పపాటి వేతన పెంపులో హేతుబద్ధత ఏమిటని ఏఐబీఓసీ జాయింట్ సెక్రటరీ రవీంద్ర గుప్తా ప్రశ్నించారు. గత రెండు వేతన సవరణల సందర్భంగా 15 శాతం ఇంక్రిమెంట్‌ను ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తాజా పరిస్థితి చూస్తుంటే, వేతన సవరణ సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వం కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందన్న విషయం స్పష్టమవుతోందని యూనియన్లు పేర్కొన్నాయి.