నిలిచిన బ్యాంకింగ్‌ | Bank strike hits operations, ATMs run dry | Sakshi
Sakshi News home page

నిలిచిన బ్యాంకింగ్‌

Mar 1 2017 12:35 AM | Updated on Sep 5 2017 4:51 AM

డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి.

ఏటీఎంలు ఖాళీ
దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు దాదాపుగా స్తంభించాయి. చాలా ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు లేక నో క్యాష్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. వేతనాలతో పాటు వివిధ డిమాండ్‌లతో యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తమ సమ్మె విజయవంతమైందని, అన్ని బ్యాంకుల శాఖలు మూతబడ్డాయని అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు.

‘నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ మొదలైన కార్యకలాపాలేవీ జరగలేదు. ప్రభుత్వ ట్రెజరీ లావాదేవీలు, ఎగుమతి..దిగుమతి లావాదేవీలు, మనీ మార్కెట్‌ కార్యకలాపాలు మొదలైనవి నిలిచాయి‘ అని చెప్పారు. నగదు బదిలీలు, క్యాష్‌ రెమిటెన్సులపైనా ప్రతికూల ప్రభావం పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ పనిచేసినా.. ఉద్యోగులు అందుబాటులో లేక  క్లియరింగ్‌ కార్యకలాపాలకూ విఘాతం కలిగిందని వెంకటాచలం పేర్కొన్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ అయిపోయాయని, పని చేసిన కొన్ని బ్యాంకుల్లోనూ నగదు పరిమిత స్థాయిలోనే ఉందని ఆయన వివరించారు.

రూ.1.3 లక్షల కోట్ల లావాదేవీలపై ప్రభావం..
బ్యాంకింగ్‌ సమ్మె కారణంగా దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల మేర ఫారెక్స్, క్లియరింగ్‌ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడనుందని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ తెలిపారు. భారీగా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ రంగంలో సంస్కరణలపై కేంద్రం కసరత్తు చేయాలని ఆయన పేర్కొన్నారు.

 డిమాండ్‌లు ఇవీ...
యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు తమ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొన్నట్లు కరూర్‌ వైశ్యా బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంక్‌ వెల్లడించాయి. తమ శాఖల్లో కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ.. ఏటీఎంలు, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ఖాతాదారులకు యథాప్రకారం సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఫెడరల్‌ బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనలేదు. యూఎఫ్‌బీయూలో 9 యూనియన్లు ఉండగా.. 2 యూనియన్లు(భారతీయ మజ్దూర్‌ సంఘ్‌కు చెందిన ది నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్, నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌) కూడా సమ్మెలో పాల్గొనలేదు.

అవుట్‌సోర్సింగ్‌ తదితర సంస్కరణలు నిలిపివేయాలని, నోట్ల రద్దు అనంతరం మరిన్ని గంటలు అధికంగా పనిచేసిన ఉద్యోగులు.. అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలని, తదుపరి వేతన సవరణ సమీక్షను సత్వరం చేపట్టాలని యూఎఫ్‌బీయూ డిమాండ్‌ చేస్తోంది. అలాగే, అన్ని క్యాడర్లలో సముచిత స్థాయిలో నియామకాలు జరపాలని, మొండిబకాయిల రికవరీకి కఠిన చర్యలు తీసుకోవాలని.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్‌ కేసులు వేయాలని, టాప్‌ ఎగ్జిక్యూటివ్స్‌ను జవాబుదారీగా చేయాలన్నవి మిగతా డిమాండ్లు. డీమోనిటైజేషన్‌ వల్ల బ్యాంకులకు అయిన అదనపు వ్యయాలను సైతం రీయింబర్స్‌ చేయాలని యూఎఫ్‌బీయూ డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement