‘ఫండ్స్‌’ వ్యాపారానికి అనిల్‌ గుడ్‌బై

Anil Ambani to withdraw defamation suits against Congress, Herald - Sakshi

నిప్పన్‌లైఫ్‌ చేతికి ఆర్‌నామ్‌ 

రిలయన్స్‌ క్యాపిటల్‌ వాటా విక్రయం

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌(ఆర్‌నామ్‌)లో రిలయన్స్‌ క్యాపిటల్, జపాన్‌కు చెందిన నిప్పన్‌లైఫ్‌కు చెరో 42.88 శాతం వాటా ఉంది. ఆర్‌నామ్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌ తనకున్న వాటాను నిప్పన్‌కు విక్రయించేందుకు తప్పనిసరిగా చేసి తీరాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెబీ నిబంధనల మేరకు ఆర్‌నామ్‌ పబ్లిక్‌ షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేరు రూ.230 చొప్పున నిప్పన్‌లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌ను కూడా ఇవ్వనున్నట్టు రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. 
రుణ భారం తగ్గింపు...ఆర్‌నామ్‌లో తన వాటాను విక్రయించడం ద్వారా వచ్చే రూ.6,000 కోట్లతో రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణ భారాన్ని 33 శాతం వరకు తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘మాకు సుదీర్ఘకాలంగా విలువైన భాగస్వామి అయిన నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆర్‌నామ్‌లో తన వాటాను 75 శాతానికి పెంచుకుంటోంది. ఆర్‌నామ్‌లో వాటా విక్రయం సరైన విలువను సొంతం చేసుకునే విధానంలో భాగమే. ఈ లావాదేవీతోపాటు అమల్లో ఉన్న ఇతర లావాదేవీలు కూడా కలిపితే రిలయన్స్‌ క్యాపిటల్‌ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 50 శాతం తగ్గిపోతుంది’’ అని అనిల్‌ అంబానీ తెలిపారు.  

ఓపెన్‌ ఆఫర్‌ 
ఆర్‌నామ్‌లో పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి 14.63 శాతం వాటాకు సమానమైన 8.99 కోట్ల షేర్లకు రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.230 చొప్పున మొత్తం రూ.2,068 కోట్లను ఇందుకోసం వినియోగించనుంది. ఆర్‌నామ్‌ నియంత్రణ నిప్పన్‌లైఫ్‌ చేతికి వెళుతుంది. అయితే, వాటా విక్రయం తర్వాత కూడా రిలయన్స్‌ క్యాపిటల్‌కు మైనారిటీ వాటా ఉంటుందని తెలుస్తోంది. దీనికి కారణం ప్రమోటర్ల వాటా గరిష్ట పరిమితి 75 శాతం కావడం గమనార్హం. అనిల్‌ అంబానీ కుమారుడు జై అనుమోల్‌ అంబానీ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌నామ్‌ కంపెనీ ప్రకటించింది. ఈ డీల్‌ నేపథ్యంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు బీఎస్‌ఈలో 2.77 శాతం లాభపడి రూ.131.90 వద్ద ముగియగా, ఆర్‌నామ్‌ షేరు 7 శాతం పెరిగి రూ.233.75 వద్ద క్లోజయింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top