భారత టారిఫ్‌ల పెంపుపై డబ్ల్యూటీవోకు అమెరికా

America Request to WTO on Indian Tariffs - Sakshi

గాట్‌ చట్టానికి విరుద్ధమని అభ్యంతరం

చర్చలకు ఏర్పాటు చేయాలని వినతి  

న్యూఢిల్లీ: భారత దిగుమతులపై టారిఫ్‌లు పెంచేసిన అగ్రరాజ్యం... అదే పని భారత్‌ చేసేసరికి ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్‌పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్‌ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్‌ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్‌ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను ఈ నెల నుంచి పెంచింది. భారత్‌ చర్య అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమెరికా ఆరోపించింది. భారత్‌ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి ట్రేడ్, టారిఫ్‌ల సాధారణ ఒప్పందం (గాట్‌) కింద అమెరికాకు అందుతున్న ప్రయోజనాలను రద్దు చేయడం లేదా బలహీనపరచడం చేస్తున్నట్లు డబ్ల్యూటీవోకు రాసిన లేఖలో అమెరికా ఆరోపించింది. గాట్‌ ఒప్పందం అన్నది డబ్ల్యూటీవో పరిధిలోని సభ్య దేశాల మధ్య కస్టమ్స్‌ సుంకాల వంటి వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉద్దేశించినది. డబ్ల్యూటీవో పరిధిలోని మరే ఇతర సభ్య దేశం నుంచి సహజంగా ఉత్పత్తి అయి వచ్చే ఈ తరహా దిగుమతులపై భారత్‌ సుంకాలు విధించజాలదని అమెరికా పేర్కొంది. అలాగే, భారత్‌ రాయితీల షెడ్యూల్‌లో పేర్కొన్న దాని కంటే కూడా విధించిన సుంకాల రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగం కింద భారత్‌తో చర్చలకు వీలు కల్పించాలని, ఇరువురికీ ఆమోదయోగ్యమైన రోజు చర్చలు జరిగేలా చూడాలని అమెరికా కోరింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top