ట్రేడింగ్‌ వేళల పెంపుపై సందిగ్ధత | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌ వేళల పెంపుపై సందిగ్ధత

Published Tue, Jul 24 2018 12:38 AM

Ambiguity on trading hours - Sakshi

ముంబై: ట్రేడింగ్‌ వేళలను పదిహేను గంటల దాకా పొడిగించేందుకు స్టాక్‌ ఎక్సే ్చంజీలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ అనుమతించినప్పటికీ .. అది ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో సాధ్యపడేలా కనిపించడం లేదు. బ్రోకింగ్‌ సంస్థలు ఇంత సుదీర్ఘ ట్రేడింగ్‌ వేళలకు సుముఖంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఎకాయెకిన 15 గంటలు కాకుండా ముందుగా 12 గంటల పాటు అమలు చేసి ..  ఆ తర్వాత మార్కెట్‌ స్పందనను బట్టి పొడిగించవచ్చన్నది బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి.

ట్రేడింగ్‌ వేళల పొడిగింపుపై ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ మరికొన్ని వారాల్లో తమ తమ ప్రణాళికలను సెబీకి సమర్పించనున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈక్విటీ క్యాష్, డెరివేటివ్స్‌ సెగ్మెంట్స్‌కి సంబంధించి స్టాక్‌ ఎక్సే ్చంజీల్లో ట్రేడింగ్‌ వేళలు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 3.30 గం. దాకా ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. రోజంతా నడిచే అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేసే ఉద్దేశంతో దేశీయంగా ట్రేడింగ్‌ వేళలను పెంచాలని సెబీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా గతంలో క్యాష్‌ మార్కెట్ల సమయాన్ని సాయంత్రం 5 గం. దాకా పొడిగించుకునేందుకు ఎక్సే ్చంజీలకు అనుమతించినప్పటికీ పలు కారణాలతో అవి అమలు చేయలేదు. అయినప్పటికీ.. తాజాగా డెరివేటివ్స్‌ విభాగం ట్రేడింగ్‌ను రాత్రి 11.55 గం. దాకా పొడిగించుకునేందుకు ఈ ఏడాది మేలో స్టాక్‌ ఎక్సే ్చంజీలను అనుమతించిన సంగతి తెలిసిందే.  ఆయా ఎక్సే ్చంజీల సంసిద్ధతను బట్టి అక్టోబర్‌ 1 నుంచి కొత్త వేళలు అమల్లోకి రావాల్సి ఉంది.  

బ్రోకింగ్‌ సంస్థల అభ్యంతరాలివి..
ట్రేడింగ్‌ పరిమాణం ఎంత స్థాయిలో ఉంటుందో తెలియకుండా .. ముందు నుంచే అర్ధరాత్రి దాకా వేళలను పొడిగించడం సరికాదని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. వేళల పొడిగింపు ప్రతిపాదన ముఖ్యంగా చిన్న సంస్థలను కలవరపరుస్తోంది. దీనికోసం అదనంగా సిబ్బందిని తీసుకోవాల్సి రానుండటం, ఫలితంగా నిర్వహణ వ్యయాలు పెరగనుండటం వాటికి ఆందోళన కలిగిస్తోంది.

బ్రోకరేజి సంస్థలు ప్రతి రోజు ట్రేడింగ్‌ వేళలను ముగిసిన తర్వాత స్టాక్‌ ఎక్సే ్చంజీలకు అసంఖ్యాకంగా నివేదికలను పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం బోలెడు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ అర్ధరాత్రి దాకా ట్రేడింగ్‌ను అనుమతించిన పక్షంలో తెల్లవారి మార్కెట్‌ ప్రారంభమయ్యేలోగా ఈ పనులన్నీ పూర్తి చేయడం కష్టసాధ్యమైన విషయం. 

రాత్రి వేళ ముఖ్యంగా 9 దాటిన తర్వాత ట్రేడింగ్‌ పరిమాణం ఎలా ఉంటుందనేది అటు స్టాక్‌ ఎక్సే్చంజీలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. దీంతో అర్ధరాత్రి 11.55 గం. దాకా కాకుండా రాత్రి 8 గం.  లేదా 9 గం. దాకా మాత్రమే ట్రేడింగ్‌ వేళలను పొడిగించేలా ప్రతిపాదనలు ఇచ్చే యోచనలో ఉన్నాయవి. ఒకవేళ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌ గణనీయంగా ఉన్న పక్షంలో ఆ తర్వాత దశలో వేళలను పొడిగించవచ్చని భావిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సాధనాలపైనా..: ట్రేడింగ్‌ వేళలను పొడిగించినా నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ వంటి కొన్ని సాధనాలనే అనుమతించడం శ్రేయస్కరమని బ్రోకింగ్‌ సంస్థలు లాబీయింగ్‌ చేస్తున్నాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లకు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సాధనాలను అందుబాటులోకి తేవడమే సెబీ ఉద్దేశమైనప్పుడు.. ఇండెక్స్‌ ఆప్షన్స్, ఫ్యూచర్స్‌ వంటి ప్రాథమిక హెడ్జింగ్‌ సాధనాల ట్రేడింగ్‌కు అనుమతిస్తే సరిపోతుందని బ్రోకింగ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.


ఇప్పటిదాకా ఎఫ్‌ఐఐలకే అనుకూలం..
డెరివేటివ్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ వేళలను పెంచడం వల్ల దేశీ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకి రిస్కులను తగ్గించుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం అమలవుతున్న ట్రేడింగ్‌ వేళలు.. దేశీ సంస్థలతో పోలిస్తే విదేశీ సంస్థలకే ఎక్కువ అనుకూలంగా ఉంటున్నాయి.

భారత్‌లో పరిమిత సమయంపాటే ట్రేడయ్యే దేశీ సూచీలు  ఎస్‌జీఎక్స్, సీఎంఈ వంటి అంతర్జాతీయ ఎక్సే ్చంజీల్లో  మాత్రం రోజంతా ట్రేడవుతూనే ఉంటాయి. దీంతో భార త్‌లో ట్రేడింగ్‌ వేళలు ముగిసిన తర్వాత అకస్మాత్తుగా ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే సదరు రిస్కుల నుంచి పోర్ట్‌ఫోలియోలను హెడ్జింగ్‌ చేసుకునేందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) ఎక్కువ వెసులుబాటు ఉంటోంది.

Advertisement
 
Advertisement