పర్సనల్‌ లోనే కానీ.. ఫ్లెక్సిబుల్‌

Allow interest only on monthly basis in personal loan - Sakshi

నెలనెలా వడ్డీ మాత్రమే కట్టే వీలు

ఆఖర్లోనే అసలు కట్టే వెసులుబాటు

కావాలనుకుంటే టర్మ్‌ లోన్‌ కింద మార్చుకోవచ్చు

ముందస్తు చెల్లింపులు చేసినా చార్జీలుండవు

చాలా సందర్బాల్లో ఆదుకునేవి వ్యక్తిగత రుణాలే. ఇంటి రిపేరు, పెళ్లి ఖర్చులు...  ఇలా అవసరం ఏదైనా పర్సనల్‌ లోన్‌ ఉపయోగపడుతుంది.  వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పర్సనల్‌ లోన్స్‌కి కొన్ని అదనపు అంశాలను జోడిస్తున్నాయి. అసలు, వడ్డీ కలిపి ప్రతి నెలా ఈఎంఐ రూపంలో చెల్లించే విధానంతో పాటు ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే కడుతూ చివర్లోనే అసలు మొత్తాన్ని కట్టేలా ప్రత్యేక ఫీచర్‌తో ఫ్లెక్సిబుల్‌ పర్సనల్‌ లోన్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి.

రుణ మొత్తం ఎంత మంజూరైనా కూడా కావాల్సినంతే విత్‌డ్రా చేసుకుని, దానికి మాత్రమే వడ్డీ కట్టే వెసులుబాటు కూడా ఉంటుంది ఈ ఫ్లెక్సిబుల్‌ పర్సనల్‌ లోన్‌ విధానంలో. ఇక ఈ లోన్‌కి సంబంధించి అసలు మొత్తాన్ని ఆఖర్లోనే కట్టాల్సి ఉన్నా... ఒకవేళ ఏకారణం వల్లనైనా అంతా ఒకేసారి కట్టలేమనుకున్న పక్షంలో రుణగ్రహీత కావాలనుకుంటే దీన్ని టర్మ్‌ లోన్‌ కింద మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటోంది. వ్యక్తిగత రుణం, ఫ్లెక్సిబుల్‌ ఫీచర్‌తో పర్సనల్‌ లోన్‌ తీరుతెన్నులు ఇలా ఉంటాయి..

పర్సనల్‌ లోన్‌ అయితే...
నిర్దిష్ట మొత్తాన్ని రుణంగా తీసుకోవచ్చు. మొత్తం రుణంపై వడ్డీ కట్టాల్సి వస్తుంది.
తర్వాత తర్వాత పెద్దగా ఆర్థిక అవసరాల్లేకుండా.. ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోదల్చుకునే వారికి ఇది అనుకూలం.
దరఖాస్తు ప్రక్రియ సులభం. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు చిరునామా ధృవీకరణ పత్రం, శాలరీ స్లిప్స్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ మొదలైనవి కూడా ఆన్‌లైన్‌లోనే దాఖలు చేయొచ్చు.
పర్సనల్‌ లోన్‌కి పాక్షికంగా కూడా ముందస్తుగానే చెల్లింపులు చేయొచ్చు. అయితే, ఇందుకు కొన్ని చార్జీలుంటాయి.
రుణమొత్తంపై రుణగ్రహీత స్థిరమైన వడ్డీ రేటు కట్టాలి. నెలవారీ కట్టే వాయిదాల్లో (ఈఎంఐ) కొంత భాగం అసలుతో పాటు కొంత భాగం వడ్డీ కూడా ఉంటుంది.

ఫ్లెక్సిబుల్‌ పర్సనల్‌ లోన్‌ అయితే...
ఆర్థిక అవసరాన్ని బట్టి విడతలవారీగా కావాల్సినంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
లోన్‌ అకౌంట్‌ నుంచి చేసే విత్‌డ్రాయల్స్, కట్టే డిపాజిట్‌ల సంఖ్యపై పరిమితి ఏమీ ఉండదు.
జారీ అయిన మొత్తం రుణంపై కాకుండా.. ఉపయోగించుకున్న మొత్తంపైనే రుణగ్రహీత వడ్డీ కట్టాల్సి ఉంటుంది.
ఫ్లెక్సిబుల్‌ పర్సనల్‌ లోన్‌ ముందస్తు చెల్లింపు సులభతరంగానే ఉంటుంది.
ఎటువంటి చార్జీలు ఉండవు.
తీసుకున్న మొత్తాన్ని ప్రీ–పే చేసే వెసులుబాటుతో పాటు, అలా కట్టేసిన ప్రీపెయిడ్‌ అమౌంటునూ దరఖాస్తు ప్రక్రియలాంటి బాదరబందీ లేకుండా మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
ఈఎంఐల కింద వడ్డీ మాత్రమే కడతారు కనక ఆదాయాన్ని కాస్త మెరుగ్గా నిర్వహించుకోవచ్చు.
ఒకవేళ అసలు, వడ్డీ కలిపి ఈఎంఐల కింద కట్టేయాలనుకున్న పక్షంలో ఫ్లెక్సిబుల్‌ పర్సనల్‌ లోన్‌ని ఎప్పుడైనా పూర్తి స్థాయి టర్మ్‌ లోన్‌ కింద మార్చుకునే వీలుంది.

చూశారుగా.. వ్యక్తిగత రుణానికి, ఫ్లెక్సిబుల్‌ ఫీచర్‌ ఉన్న పర్సనల్‌ లోన్‌కి మధ్య వ్యత్యాసాలు. పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలనుకునేటప్పుడు.. ఆర్థిక అవసరాలను బట్టి తగిన విధానాన్ని ఎంచుకోండి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top