టెలికంలో అసాధారణ సంక్షోభం..

AGR Issue An Unprecedented Crisis For Telecom Industry - Sakshi

ఏజీఆర్‌ బాకీల చెల్లింపులపై సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం

భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వెల్లడి

కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో భేటీ

న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా మిగతా చెల్లింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తమకు మార్చి 17 దాకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోగానే కట్టేస్తామని వివరించారు. గురువారం కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత మిట్టల్‌ ఈ విషయాలు తెలిపారు. భేటీ సందర్భం గా పరిశ్రమపై భారీ పన్నుల భారం ఉంటోందని, వీటిని తగ్గించాలని ఆయన కోరారు.  

మరో రూ. 1,000 కోట్లు కట్టిన వొడాఫోన్‌
ఏజీఆర్‌ బకాయిల కింద టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా గురువారం మరో రూ. 1,000 కోట్లు.. టెలికం శాఖకు (డాట్‌) చెల్లించింది. సోమవారమే కంపెనీ 2,500 కోట్లు కట్టిన సంగతి తెలిసిందే. వొడాఫోన్‌ ఐడియా మొత్తం రూ. 53,000 కోట్ల బాకీలు కట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, టాటా టెలీసర్వీసెస్‌ నుంచి మిగతా బాకీల వసూలుకు ఒకటి.. రెండు రోజుల్లో నోటీసులు పంపించనున్నట్లు వివరించాయి. డాట్‌ లెక్కల ప్రకారం టాటా టెలీ సర్వీసెస్‌ దాదాపు రూ. 14,000 కోట్లు కట్టాల్సి ఉండగా..ఆ సంస్థ సోమవారం నాడు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టింది.

ఏజీఆర్‌ లెక్కల మదింపులో కేంద్రం..
ఇక ఏజీఆర్‌ బాకీలు డాట్‌ చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉంటాయని టెల్కోలు చెబుతున్న నేపథ్యంలో టెలికం శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. మార్చి 17లోగా టెల్కోల లెక్కలను టెలికం శాఖ మదింపు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని టెల్కోల గణాంకాలను టెస్ట్‌ చెక్‌ చేయనున్నప్పటికీ.. మొత్తం బాకీలు కట్టేశామంటున్న సంస్థలతో ముందుగా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వివరించాయి. డాట్‌ సొంత లెక్కలు, టెల్కోల లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. టెలికం సంస్థలు కట్టాల్సిన లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను లెక్కించేందుకు టెలికంయేతర కార్యకలాపాల ద్వారా కూడా వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ డాట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు గతేడాది ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. గతంలో విధించిన జనవరి 23 డెడ్‌లైన్‌ను టెల్కోలు ఉల్లంఘించడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారణను మార్చి 17కి వాయిదా వేసింది.

అందరికీ ప్రయోజనంపై కేంద్రం దృష్టి..
ఏజీఆర్‌ బాకీల విషయంలో అటు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తూనే.. ఇటు టెలికం రంగం.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఇప్పటిదాకా రూ. 16,000 కోట్ల ఏజీఆర్‌ బాకీలు చెల్లించినట్లు వివరించాయి. మరో 7–8 రోజుల్లో మరిన్ని చెల్లింపులు జరుపుతామని టెల్కోలు చెప్పాయని ఓ అధికారి పేర్కొన్నారు.

టెల్కోల బాకీల్లో వడ్డీ, పెనాల్టీలే అధికం..
టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బాకీల కింద కట్టాల్సినది రూ. 22,589 కోట్లని.. అయితే వడ్డీ, పెనాల్టీలు కలిపితే ఇది రూ. 92,641 కోట్లకు పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు కట్టాల్సినది రూ. 16,746 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. భారతి ఎయిర్‌టెల్‌ బాకీలు రూ. 5,529 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 6,871 కోట్లు, టాటా గ్రూప్‌ రూ. 2,321 కోట్లు, టెలినార్‌ (ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ. 529 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 614 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ బకాయిలు రూ. 876 కోట్లు ఉంటాయని వివరించాయి. ఈ లెక్కలను జూలైలో తయారు చేశారని, తాజాగా మరోసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. డాట్‌ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజుతో పాటు టెలికం సంస్థలు దాదాపు రూ. 55,054 కోట్ల మేర స్పెక్ట్రం యూసేజి చార్జీలు కూడా కట్టాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top